Kashmir: ఆర్మీ వాహనాలపై ఉగ్రదాడి.. అమరులైన నలుగురు జవాన్లు

జమ్మూ-కశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో భద్రతాబలగాలే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగింది. సైనిక వాహనాలపై జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు.

Updated : 21 Dec 2023 22:24 IST

శ్రీనగర్‌: జమ్మూ- కశ్మీర్‌ (Jammu Kashmir)లో భద్రతాబలగాలే లక్ష్యంగా జరిపిన ఉగ్రదాడిలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడి పూంచ్‌ (Poonch Attack) జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు అమరులు కాగా.. మరో ముగ్గురు గాయపడినట్లు సైనిక అధికారులు వెల్లడించారు. 

పూంచ్‌ జిల్లాలోని బుఫ్లియాజ్‌ సమీపంలో బుధవారం రాత్రి నుంచి ఉగ్రవాదుల కోసం వేట సాగుతోంది. ఈ క్రమంలోనే రెండు వాహనాల్లో జవాన్లు ఆ ప్రదేశానికి బయల్దేరారు. రాజౌరీ- ఠాణామండీ- సురన్‌కోటే రహదారిపై సావ్ని ప్రాంతానికి చేరుకోగానే.. ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో నలుగురు జవాన్లు అమరులయ్యారు. జవాన్లు సైతం ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి అదనపు బలగాలతోపాటు అంబులెన్స్‌లను తరలించినట్లు అధికారులు తెలిపారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై ఇది రెండో ఉగ్రదాడి కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని