పార్కింగ్ వివాదం.. హోటల్ యజమానిపై చేయిచేసుకున్న నటుడు

పార్కింగ్ విషయంలో చోటుచేసుకున్న వివాదం తీవ్రరూపం దాల్చి.. ఘర్షణకు దారితీసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..? 

Published : 08 Jun 2024 18:09 IST

కోల్‌కతా: బెంగాలీ నటుడు, తృణమూల్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే సోహమ్‌ చక్రవర్తి (Soham Chakraborty) కోల్‌కతాలోని ఒక రెస్టారంట్ యజమానిపై చేయిచేసుకున్నారు. పార్కింగ్ విషయంలో జరిగిన వాగ్వాదమే ఈ ఘటనకు దారితీసింది. దీనిపై ఇరువర్గాలు భిన్నమైన వాదన వినిపించాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం..

కోల్‌కతాలోని న్యూటౌన్ ప్రాంతంలోని తన రెస్టారంట్‌ పైభాగాన్ని షూటింగ్ నిమిత్తం సోహమ్‌కు ఇచ్చినట్లు యజమాని ఆలం తెలిపారు. ‘‘నా రెస్టారంట్‌పైన స్థలాన్ని షూటింగ్ నిమిత్తం ఆయనకు ఇచ్చాను. అందుకోసం నేను డబ్బు వసూలు చేయలేదు. ఆయన భద్రతా సిబ్బంది మా వినియోగదారులకు కేటాయించిన పార్కింగ్ ప్రాంతంలో వాహనాలను పార్క్ చేశారు. వాటిని అక్కడ పార్క్‌ చేయొద్దని మా సిబ్బంది చెప్పారు. సోహమ్ ఒక ఎమ్మెల్యే అని, అభిషేక్ బెనర్జీకి సన్నిహితుడని వారు చెప్పారు. ఆయన ఎవరైనా నాకు సంబంధం లేదని నేను బదులిచ్చాను. ఆ వెంటనే సోహమ్ వచ్చి, నా ముఖంపై కొట్టాడు..తన్నాడు’’ అని ఆలం ఆరోపించారు.

హోటల్ యజమానిని కొట్టినట్లు తృణమూల్ ఎమ్మెల్యే అంగీకరించాడు. ‘‘పెద్దగా కేకలు వినిపించడంతో నేను వెంటనే కిందికి వచ్చాను. ఆ యజమాని నా సిబ్బందిని తిట్టడం కనిపించింది. అభిషేక్ బెనర్జీని కూడా నిందించాడు. దాంతో సహనం కోల్పోయిన నేను చెంపదెబ్బ కొట్టాను’’ అని సోహమ్ వెల్లడించారు. వారిద్దరి మధ్య వాగ్వాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని హోటల్ మేనేజర్ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని