Bihar Assembly Elections: మగధ్‌లో మహా ఉత్కంఠ!

Eenadu icon
By National News Desk Updated : 03 Nov 2025 20:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

బంధువుల మధ్యే చాలాచోట్ల పోటీ
రెబల్స్‌ ప్రభావమూ అధికమే..

బిహార్‌లోని మగధ్‌ ప్రాంతంలో అసెంబ్లీ పోరు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎన్డీఏ, మహాగఠ్‌బంధన్‌ల మధ్యలో గట్టి పోటీ నెలకొంది. జన్‌ సురాజ్‌ పార్టీ అభ్యర్థులు, రెబల్స్‌ ఈ రెండు కూటములకు తలనొప్పిగా మారారు. ఈ ప్రాంతంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే కులం మధ్య పోటీ జరుగుతోంది. కొన్ని చోట్ల బంధువులే పోటీపడుతున్నారు. ఇక్కడి 5 జిల్లాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా చోట్ల రెండు కూటములూ ఒకే వర్గానికి టికెట్లిచ్చాయి. రాష్ట్రానికి దక్షిణాన ఉన్న మగధ్‌లో ఔరంగాబాద్, గయా, ఆర్వాల్, జెహానాబాద్, నవడా జిల్లాలున్నాయి. 

బేలాగంజ్, బోధ్‌ గయా, బారాఛత్తీ, వజీర్‌గంజ్, నవడా, హిసువా, ఔరంగాబాద్‌లలో ఎన్డీయే, మహాగఠ్‌బంధన్‌ కూటములు టికెట్లిచ్చిన అభ్యర్థుల సామాజిక వర్గాలు ఒకటే కావడం విశేషం. 

ఎన్డీయేకి సవాలే..

2020 అసెంబ్లీ ఎన్నికల్లో మగధ్‌ ప్రాంతం ఎన్డీయేకు షాక్‌ ఇచ్చింది. పక్కనే ఉన్న షాబాద్‌ మాదిరిగానే ఇక్కడా ఫలితాలు అనుకూలంగా రాలేదు. గత ఎన్నికల్లో మగధ్‌లోని 26 సీట్లలో కేవలం 6 చోట్లే ఎన్డీయే గెలిచింది. మహాగఠ్‌బంధన్‌ 20 చోట్ల విజయం సాధించింది. 

జెహానాబాద్, ఔరంగాబాద్, ఆర్వాల్‌ జిల్లాల్లో ఎన్డీయే ఖాతానే తెరవలేదు. ఇక్కడా కుష్వాహా, ఎస్సీల్లో చీలికతో ఆ కూటమి నష్టపోయింది. 

గత ఎన్నికల్లో ఎల్జేపీ ఒంటరిగా పోటీ చేసింది. ఈసారి ఎన్డీయేలోకి తిరిగిరావడంతో ఈ ప్రాంతంలో 6 సీట్లు ఆ పార్టీకి దక్కాయి. మాజీ సీఎం జీతన్‌ రామ్‌ మాంఝీ నేతృత్వంలోని హెచ్‌ఏఎం పార్టీకి 5 సీట్లు దక్కాయి. ఎస్సీ వర్గాల వారిని ఆకట్టుకునేందుకు ఆ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు 11 సీట్లను ఎన్డీయే కేటాయించింది. ఈ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు ఆర్జేడీ పలు చోట్ల అభ్యర్థులను మార్చింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ 15 సీట్లను గెలుచుకుంది.


బేలాగంజ్‌లో..

బేలాగంజ్‌లో ఈసారి పోటీ మాత్రం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. జెహానాబాద్‌ ఎంపీ, ఆర్జేడీ అగ్ర నేత సురేంద్ర ప్రసాద్‌ యాదవ్‌ అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. 2024 నవంబరులో ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమారుడు విశ్వనాథ్‌ యాదవ్‌ పరాజయం పాలయ్యారు. అదీ బంధువైన మనోరమా దేవి చేతిలో కావడంతో ఆయనకు తల తీసినట్లయింది. ఈసారీ వారి మధ్యే పోటీ నెలకొంది. దీంతో సురేంద్ర ప్రసాద్‌ యాదవ్‌ చావోరేవో అన్నట్లుగా కుమారుడి తరఫున ప్రచారం చేస్తున్నారు.

  • బేలాగంజ్‌లో 10 నియోజకవర్గాలుండగా.. జేడీయూ ఒక్కచోటే పోటీ చేస్తోంది. 
  • బోధ్‌ గయాలోనూ ఆర్జేడీ, ఎల్జేపీల మధ్య ఒకే వర్గానికి చెందినవారు పోటీ పడుతున్నారు. అయితే పాశ్వాన్‌ వర్గానికి చెందినవారే 1972 నుంచి 2020 మధ్య 8 సార్లు విజయం సాధించారు. 
  • బారాఛత్తీలోనూ ఒకే వర్గం పోటీపడుతోంది. ఇక్కడ జీతన్‌ రామ్‌ మాంఝీ బంధువు జ్యోతి దేవి, మాజీ ఎమ్మెల్యే మనవరాలు తనుశ్రీ మాంఝీ పోటీ చేస్తున్నారు.
  • వజీర్‌గంజ్‌లో సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అవధేశ్‌ సింగ్‌తో భాజపాకు చెందిన వీరేంద్ర సింగ్‌ తలపడుతున్నారు. వీరిద్దరూ ఒకే వర్గానికి చెందినవారు. 
  • నవడాలో కుటుంబంలోనే పేరు సాగుతోంది. జేడీయూ నుంచి విభా దేవి, ఆర్జేడీ నుంచి కౌషల్‌ యాదవ్‌ తలపడుతున్నారు. వీరిద్దరూ ఎన్నికలకు ముందు అటు ఇటు పార్టీలు మారారు. 
  • హిసువాలో భూమిహార్‌ వర్గానికి చెందిన నీతు కుమారి (కాంగ్రెస్‌), అనిల్‌ సింగ్‌ (భాజపా) పోటీ చేస్తున్నారు.
  • ఔరంగాబాద్‌లోనూ ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా రాజకీయాలను ప్రభావితం చేస్తున్న భూమిహార్‌ వర్గం (అగ్ర వర్ణం) నుంచే అభ్యర్థులు పోటీపడుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఆనంద్‌ సింగ్, భాజపా నుంచి త్రివిక్రమ్‌ సింగ్‌ తలపడుతున్నారు.

దడ పుట్టిస్తున్న రెబల్స్‌

మగధ్‌ ప్రాంతంలో ఎన్డీయే, మహాగఠ్‌బంధన్‌ కూటములకు రెబల్స్‌ బెడద భారీగానే ఉంది. వారు స్వతంత్రులుగానూ, జన్‌ సురాజ్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. రెబల్స్‌ కారణంగా గోవింద్‌పుర్, గురువా, నబీనగర్‌లలో త్రిముఖ పోటీ నెలకొంది.

  • గోవింద్‌పుర్‌లో ఆర్జేడీ రెబల్, సిటింగ్‌ ఎమ్మెల్యే ఎండీ కమ్రాన్‌.. అధికారిక అభ్యర్థి పూర్ణిమా యాదవ్‌కు చెమటలు పట్టిస్తున్నారు. ప్రత్యర్థి, ఎల్జేపీ అభ్యర్థికీ వణుకు పుట్టిస్తున్నారు.
  • గురువాలో జేడీయూ రెబల్‌ అభ్యర్థి సంజీవ్‌ శ్యామ్‌.. ఎన్డీయే అధికారిక అభ్యర్థిని ఇబ్బంది పెడుతున్నారు.
  • నబీనగర్‌లోనూ జేడీయూ రెబల్‌ అభ్యర్థితో అధికారిక అభ్యర్థికి తిప్పలు తప్పడం లేదు.

నేషనల్‌ డెస్క్‌

Tags :
Published : 03 Nov 2025 20:40 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు