Heart Attack Deaths: కొవిడ్ వ్యాక్సిన్లపై సిద్ధరామయ్య వ్యాఖ్యలు.. బయోకాన్ చీఫ్‌ కౌంటర్

Eenadu icon
By National News Team Updated : 03 Jul 2025 12:11 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: హసన్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న మరణాలకు కొవిడ్‌ టీకాల ప్రభావమే కారణం కావొచ్చని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) అనుమానం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. తాజాగా బయోకాన్ (Biocon) చీఫ్‌ కిరణ్‌ మంజుదార్‌ షా (Kiran Mazumdar-Shaw) ఈ వ్యాఖ్యలపై స్పందించారు. సిద్ధరామయ్య అనుమానాలను తోసిపుచ్చిన ఆమె.. సీఎం వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయన్నారు.

‘భారత్‌లో అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌లు అత్యవసర వినియోగ అధికార చట్టం కింద ఆమోదించడం జరిగింది.  ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగానే ఇది తయారైంది. ఈ వ్యాక్సిన్‌లపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దు. ఇవి లక్షల మంది ప్రాణాలను కాపాడాయి. ప్రజలపై దుష్పరిణామాలు సంభవించిన కేసులు చాలా అరుదుగా చోటుచేసుకున్నాయి. ఈ వ్యాక్సిన్లపై నిందలు వేయడం మానేసి దాని అభివృద్ధి వెనక ఉన్న సైన్స్‌ను గుర్తించడం చాలా ముఖ్యం’ అని ఆమె రాసుకొచ్చారు. 

గత నెలలోనే హసన్‌ జిల్లాలో గుండెపోటుతో 20 మందికి పైగా మరణించడం (Heart Attack Deaths)పై సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మరణాలకు కచ్చితమైన కారణాన్ని గుర్తించి పరిష్కారాలు కనుగొనేందుకు ఒక కమిటీని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. పది రోజుల్లో దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కొవిడ్‌ వ్యాక్సిన్లను ప్రజలకు తొందరపాటుగా ఆమోదించడం, పంపిణీ చేయడం కూడా మరణాలకు కారణం కావొచ్చని అనుమానం వ్యక్తంచేశారు. ఇటీవల పలు అధ్యయనాలు ఈ వ్యాక్సిన్లతో గుండెపోటు పెరుగుదలకు కారణమవుతాయని వెల్లడించాయన్నారు. దీనిపై కూడా సమగ్ర అధ్యయనం చేయాలని కమిటీని ఆదేశించినట్లు తెలిపారు.

ఇదిలాఉండగా.. యువత ఆకస్మిక మరణాలకు జీవనశైలి, ముందస్తు ఆరోగ్య సమస్యలే కారణం తప్ప, కొవిడ్ వ్యాక్సిన్‌ కాదని బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), దిల్లీ ఎయిమ్స్‌ నిర్వహించిన అధ్యయనాల్లో ఈ విషయం తేలిందని పేర్కొంది. దేశీయంగా తయారైన కొవిడ్‌ వ్యాక్సిన్లు సురక్షితంగా, సమర్థంగా పనిచేస్తున్నాయని, తీవ్ర దుష్పరిణామాలు సంభవించిన ఉదంతాలు అత్యంత అరుదుగా కనిపించాయని ఐసీఎంఆర్, జాతీయ రోగ నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ) అధ్యయనాలు వెల్లడించినట్లు వివరించింది.

Tags :
Published : 03 Jul 2025 11:57 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు