Ravi Kishan: నిన్ను చంపేస్తాం.. భాజపా ఎంపీ రవి కిషన్‌కు బెదిరింపులు

Eenadu icon
By National News Team Published : 01 Nov 2025 08:02 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ నటుడు, ఎంపీ రవి కిషన్‌ (Ravi Kishan)కు హత్య బెదిరింపులు వచ్చాయి. తమ వర్గాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేసి ఎంపీని చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై గోరఖ్‌పుర్‌లో పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. 

నిందితుడు ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేదీకి ఫోన్‌ చేసి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం.. ‘రవి కిషన్‌ మా వర్గాన్ని అవమానించేలా మాట్లాడాడు. కాబట్టి అతన్ని కాల్చేస్తాం. అతని ప్రతి కదలిక నాకు తెలుసు. నాలుగు రోజుల్లో అతను బిహార్‌కు వచ్చేటప్పుడు.. చంపేస్తాం’ అని బెదిరించాడన్నారు. ఈ క్రమంలో ఎంపీని ఉద్దేశిస్తూ.. పలు అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశాడని పేర్కొన్నారు. అయితే, రవికిషన్‌ ఏ వర్గాన్ని ఉద్దేశిస్తూ.. ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదని ద్వివేది పేర్కొన్నారు. నిందితుడు బిహార్‌లోని అరా జిల్లాకు చెందిన అజయ్‌ కుమార్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై గోరఖ్‌పుర్‌లోని పోలీస్‌స్టేషన్‌లో ఎంపీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఎంపీకి భద్రత పెంచాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

తాజా బెదిరింపులపై రవికిషన్‌ స్పందించారు. గుర్తుతెలియని ఓ వ్యక్తి ఫోన్‌ కాల్‌లో తనను దుర్భాషలాడటంతో పాటు తన తల్లి గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని తెలిపారు. ఇవి సమాజంలో ద్వేషం, అరాచకత్వాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నాలన్నారు. ప్రజాస్వామ్య బలం, సైద్ధాంతిక సంకల్పంతో వీటిని ఎదుర్కొంటామన్నారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనన్నారు. ప్రజాసేవ, ధర్మమార్గంలో నడవాలనేది తన రాజకీయ వ్యూహం మాత్రమే కాదని.. జీవిత సంకల్పమని వ్యాఖ్యానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని