RS polls: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌-ఓటింగ్‌.. కర్ణాటకలో భాజపాకు, హిమాచల్‌లో కాంగ్రెస్‌కు షాక్‌!

కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో మొత్తం 15 రాజ్యసభ స్థానాలకు (Rajya Sabha polls) జరిగిన పోలింగ్‌లో క్రాస్‌-ఓటింగ్‌ జరిగినట్లు సమాచారం.

Updated : 27 Feb 2024 23:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో కలిపి మొత్తం 15 రాజ్యసభ స్థానాలకు (Rajya Sabha polls) మంగళవారం ఓటింగ్‌ జరిగింది. ఈసందర్భంగా పలు పార్టీలకు క్రాస్‌-ఓటింగ్‌ ప్రభావం చూపించింది. హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో భాజపాకు అనుకూలంగా ప్రత్యర్థులు ఓటు వేయగా.. కర్ణాటకలో మాత్రం భాజపాకు ఎదురుదెబ్బ తగిలింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 రాజ్యసభ స్థానాలకు ఓటింగ్‌ జరగగా.. భాజపా ఎనిమిది మంది అభ్యర్థులను బరిలోకి దింపి అన్ని స్థానాల్లో గెలిచింది. సమాజ్‌వాదీ పార్టీ ముగ్గురిని నిలిపి రెండు స్థానాల్లో గెలిచింది. ఏడుగురు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేలు భాజపాకు అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ వేసినట్లు సమాచారం. హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ.. అక్కడ భాజపాకు అనుకూలంగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతోపాటు మరో ముగ్గురు స్వతంత్రులు భాజపాకు జై కొట్టారు. దీంతో కాంగ్రెస్‌కు చెందిన అభిషేక్‌ సింఘ్వీకి నిరాశే ఎదురైంది.

భాజపాకు ఎదురుదెబ్బ..

కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాజపా-జేడీఎస్‌ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. భాజపాకు చెందిన ఎమ్మెల్యే ఎస్‌టీ సోమశేఖర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ మాకెన్‌కు ఓటేసినట్లు సమాచారం. మరో ఎమ్మెల్యే శివరాం హెబ్బర్‌ ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. దీంతో కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో విజయం ఖాయం కాగా.. భాజపాకు ఒకచోట అవకాశం లభించింది.

భాజపాపై అసంతృప్తితో ఉన్న ఈ ఇద్దరు రెబల్‌ ఎమ్మెల్యేలు.. కొంతకాలంగా కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉన్నట్లు సమాచారం. క్రాస్‌ ఓటింగ్‌ నేపథ్యంలో ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అంశంపై స్పీకర్‌తో మాట్లాడతామని విపక్ష నేత ఆర్‌అశోకా పేర్కొన్నారు. ఓటింగ్‌ అనంతరం విలేకర్లతో మాట్లాడిన సోమశేఖర్‌.. తన మనస్సాక్షికి అనుగుణంగానే ఓటు వేశానని చెప్పడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని