8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు తీపి కబురు

Eenadu icon
By National News Desk Published : 29 Oct 2025 06:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

8వ వేతన సవరణ సంఘం విధివిధానాలకు క్యాబినెట్‌ ఆమోదం
కమిషన్‌కు జస్టిస్‌ రంజనాప్రకాశ్‌ దేశాయ్‌ సారథ్యం
తుది నివేదిక సమర్పణకు 18 నెలల గడువు 
2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న సిఫార్సులు! 
50 లక్షలమంది ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి 
ఎరువులపై రాయితీల పెంపునకూ మంత్రిమండలి ఆమోదం

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రిమండలి శుభవార్త అందించింది. 8వ వేతన సవరణ సంఘం విధివిధానాల(టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌)కు మంగళవారం ఆమోద ముద్రవేసింది. ఈ కమిషన్‌కు ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రంజనాప్రకాశ్‌ దేశాయ్‌ నియమితులయ్యారు. ఇందులో తాత్కాలిక సభ్యుడిగా బెంగుళూరు ఐఐఎం ప్రొఫెసర్‌ పులాక్‌ ఘోష్, సభ్య కార్యదర్శిగా కేంద్ర పెట్రోలియం-సహజవాయువుల శాఖ కార్యదర్శి పంకజ్‌ జైన్‌ ఉంటారు. ఈ సంఘం 18 నెలల్లో తమ తుది నివేదికను సమర్పిస్తుంది. అవసరమైతే మధ్యంతర నివేదికలనూ అందజేస్తుంది. 2026 జనవరి 1 నుంచి దీని సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశముందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. వీటివల్ల రక్షణ సిబ్బంది సహా సుమారు 50 లక్షలమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షలమంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది. 

స్పష్టంగా విధివిధానాలు 

8వ వేతన సవరణ సంఘం తన సిఫార్సులను సమర్పించడానికి ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలను కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. దాని ప్రకారం- 

  • దేశంలో ఆర్థిక పరిస్థితులను, ఆర్థిక వివేకం (ఫిస్కల్‌ ప్రుడెన్స్‌) అవసరాన్ని ఈ సంఘం పరిగణనలోకి తీసుకోవాలి. 
  • అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అవసరమయ్యే వ్యయం కోసం తగిన వనరులు అందుబాటులో ఉండేలా చూడాలి. 
  • నాన్‌ కంట్రిబ్యూటరీ పింఛను పథకాల వ్యయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 
  • కేంద్ర వేతన సవరణ సంఘం సిఫార్సులను కొన్ని మార్పులతో రాష్ట్ర ప్రభుత్వాలూ స్వీకరిస్తున్న నేపథ్యంలో దీని సిఫార్సుల వల్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వనరులపై పడే ప్రభావాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. 
  • కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటురంగంలోని ఉద్యోగులకు ప్రస్తుతం అమల్లో ఉన్న జీతభత్యాల నిర్మాణం, ప్రయోజనాలు, పని పరిస్థితుల గురించి అధ్యయనం చేసి సిఫార్సులు చేయాలి. 

ఆ ఒక్క అంశాన్ని తొలగించి.. 

కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సవరణ సంఘానికి నిర్దేశించిన 5 విధివిధానాల్లో నాలుగింటిని ఈసారి యథాతథంగా కొనసాగించింది. ఇదివరకు నిర్దేశించిన వాటిలో ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ విధానాలు, వాటిని ఇక్కడ స్వీకరించేందుకు ఉన్న అవకాశాలు, భారతీయ పరిస్థితులకు వాటి అనుకూలత, ఔచిత్యం’’ అన్నదాన్ని ఇప్పుడు తొలగించింది. దాని స్థానంలో కొత్తగా ‘నాన్‌కంట్రిబ్యూటరీ పింఛను పథకాలకయ్యే వ్యయం’ అన్న అంశాన్ని చేర్చింది. 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్‌ ఈ ఏడాది జనవరిలోనే సూత్రప్రాయ అంగీకారం తెలిపిన సంగతి గమనార్హం. 7వ పే కమిషన్‌ 2014 ఫిబ్రవరిలో ఏర్పాటుకాగా, దాని సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. 

జస్టిస్‌ రంజనాప్రకాశ్‌ దేశాయ్‌ నేపథ్యమిదీ.. 

జస్టిస్‌ రంజనాప్రకాశ్‌ దేశాయ్‌ 2011 సెప్టెంబరు 13 నుంచి 2014 అక్టోబర్‌ 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. ప్రస్తుతం ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌గా ఉన్నారు. గతంలో జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్‌కు, ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ముసాయిదా కోసం ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీకి నేతృత్వం వహించారు. 

పాస్ఫరస్, సల్ఫర్‌ ఎరువులపై రాయితీ పెంపు 

2025-26 రబీ సీజన్‌కు పాస్ఫరస్, సల్ఫర్‌ ఎరువులపై రాయితీని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఒక్కో కిలోకు ఫాస్ఫేట్‌పై రూ.47.96, సల్ఫర్‌పై రూ.2.87 రాయితీగా అందించనుంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో వీటిపై సబ్సిడీలు వరుసగా రూ.43.60, రూ.1.77గా ఉన్న సంగతి గమనార్హం. మరోవైపు- 2025-26 రబీ సీజన్‌కు నత్రజని, పొటాష్‌లపై రాయితీని మాత్రం ప్రభుత్వం మార్చలేదు. కిలోకు నత్రజనిపై రూ.43.02, పొటాష్‌పై రూ.2.38 రాయితీ కొనసాగనుంది. ఈ రేట్లను 2025 అక్టోబరు 1 నుంచి 2026 మార్చి 31 వరకు వర్తింపజేస్తారు. మొత్తంగా రబీ సీజన్‌లో సబ్సిడీల కోసం కేంద్రం రూ.37,952 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోద ముద్ర వేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని