Modi: ‘భారత్‌ను చైనాతో పోల్చొద్దు..!’ మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi: భారత్‌ను ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోల్చాలి గానీ.. పొరుగు దేశం చైనాతో కాదని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. చైనా ప్రజాస్వామ్య దేశం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

Updated : 22 Dec 2023 14:23 IST

దిల్లీ: ఆర్థిక వృద్ధి విషయంలో భారత్‌ (India)ను పదేపదే చైనా (China)తో పోల్చడాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) వ్యతిరేకించారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. మన పొరుగున ఉన్న చైనా ప్రజాస్వామ్య దేశం కాదని, అక్కడ నియంతృత్వ పాలన ఉందని విమర్శించారు. ఈ సందర్భంగా దేశంలో నిరుద్యోగం, అవినీతి, పాలనాపరమైన అడ్డంకులు, నైపుణ్యాల అంతరం ఉందంటూ వ్యక్తమవుతున్న ఆందోళనలను కూడా ప్రధాని తోసిపుచ్చారు.

‘‘ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడేటప్పుడు భారత్‌ను చైనాతో పోల్చడం సరికాదు. దిల్లీని ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోలిస్తే మరింత సముచితంగా ఉంటుంది. ఎందుకంటే మా పొరుగు దేశంలో ప్రజాస్వామ్య పాలన లేదు’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఇక, అవినీతి, నిరుద్యోగం వంటి సవాళ్లే ఉంటే.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ గుర్తింపు సాధించేది కాదని అన్నారు.

‘అవి కేవలం ఆరోపణలే’.. భారత్‌లో వివక్షపై ప్రధాని మోదీ స్పందన

‘‘ప్రపంచ స్థాయి కంపెనీల్లో భారత సంతతి వ్యక్తులు సీఈవో హోదాల్లో ఉన్నారు. భారత్‌లో నైపుణ్యాల అంతరం లేదని చెప్పేందుకు ఇదే సరైన ఉదాహరణ’’ అని మోదీ తెలిపారు. విదేశీ కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులను కల్పిస్తోందని ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు. తద్వారా ప్రపంచ స్థాయి కంపెనీలు భారత్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఇదే ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ పలు కీలక అంశాల గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. భారత్‌లో మైనార్టీలను అణచివేస్తున్నారన్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. ‘‘వివిధ రకాల వేదికలపై విమర్శకులు(విపక్షాలు) తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడిస్తారు. అలాంటప్పుడు ఆరోపణలకు సమాధానం చెప్పి.. వాటిని ఖండించే హక్కు అవతలి పక్షానికి ఉంటుంది’’ అని మోదీ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు