Swati Maliwal case: సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్‌ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు

ఆప్‌ నేత స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో బిభవ్‌ కుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. 

Updated : 19 May 2024 13:57 IST

దిల్లీ: ఆప్ నేత స్వాతి మాలీవాల్‌ (Swati Maliwal)పై దాడి చేసిన ఆరోపణల కేసులో సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను ధ్వంసం చేసి ఉండొచ్చని దిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సహాయకుడు బిభవ్ కుమార్‌ (Bibhav Kumar)ను పోలీసులు శనివారం ఐదు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు.

ఒక పార్లమెంటు సభ్యురాలిపై, సీఎం ఇంట్లో దాడి జరగడం చాలా తీవ్రమైన పరిణామమని డిప్యూటీ కమిషనర్ అంజిత చెప్యాల అన్నారు. దర్యాప్తు చేస్తున్న సమయంలో నిందితుడు సహకరించలేదని, సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ దాడి వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నామని తెలిపారు. 

బిభవ్‌ కుమార్‌ తన ఐఫోన్ 15  పాస్‌వర్డ్‌ను తెలపడానికి సైతం నిరాకరించారని వారు పేర్కొన్నారు తన ఫోన్ హ్యాంగ్‌ అయినందున దానిని ముంబయిలో ఫార్మాట్ చేయించానని దాటవేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఆయన సాక్ష్యాలను ధ్వంసం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కాబట్టి బిభవ్‌ను ముంబయి తీసుకెళ్లి మొబైల్‌ను అన్‌లాక్‌ చేయిస్తామన్నారు.  సీఎం నివాసంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలో కొంత భాగం ఖాళీగా ఉందని వారు పేర్కొన్నారు. నిందితుడు బయట ఉంటే తన హోదాను ఉపయోగించి సాక్షులను బెదిరించవచ్చు, సాక్ష్యాలను తారుమారు చేయవచ్చనే కారణంతో ఆయనను అదుపులోకి తీసుకున్నామన్నారు. 

‘‘సీఎం నివాసంలో కూర్చున్న నా వద్దకు బిభవ్‌ వచ్చి దాడికి దిగాడు. 7-8 సార్లు చెంపపై కొట్టాడు. ఛాతి, కడుపుపై కాలితో తన్నాడు. ఏం జరుగుతుందో అర్థం కాక నేను షాక్‌కు గురయ్యా. సాయం కోసం అరిచా. నన్ను నేను రక్షించుకునేందుకు అతడిని నా కాళ్లతో బలంగా తోసేశా. పరిగెడుతుంటే నా చొక్క పట్టుకుని వెనక్కి లాగాడు. సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడు. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పితో నడవలేకపోయా. ఎలాగో తన నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్‌ చేశా’’ అని స్వాతి వెల్లడించినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

దిల్లీ పోలీసులు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని నిందితుడి తరపు న్యాయవాది ఆరోపించారు.  సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత మే 16న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆయన అన్నారు. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కి కాల్ చేసిన అనంతరం మాలీవాల్ ఎటువంటి వైద్య సహాయం తీసుకోలేదని పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ దిల్లీ పోలీసుల తరపున ఉన్న న్యాయవాది  దాడి తర్వాత మాలీవాల్ షాక్‌లో ఉన్నారని, కోలుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. 

ఇటీవల దాడి ఘటన నిజమే అని ఒప్పుకున్న ఆప్‌ నేత  సంజయ్ సింగ్  ముఖ్యమంత్రి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. తాజాగా  ఆప్‌ నేత ఆతిశీ మాట్లాడుతూ మాలీవాల్‌పై ఉన్న అక్రమ నియామకాల కేసును బూచిగా చూపి సీఎంకు వ్యతిరేకంగా పన్నిన కుట్రలో భాజపా ఆమెను పావుగా మార్చిందని  ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని