China: డ్రాగన్‌ కవ్వింపు.. భారత సరిహద్దులో అధునాతన ఫైటర్‌ జెట్‌ల మోహరింపు

చైనా (China) మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. అధునాతన జే-20 ఫైటర్‌ జెట్లను (J-20 Fighter jets) సిక్కింకు సమీపంలోని భారత్‌- చైనా (India-China) సరిహద్దుకు 150 కి.మీ. కంటే తక్కువ దూరంలో మోహరించింది.

Published : 30 May 2024 19:22 IST

image credit: All Source Analysis

దిల్లీ: పొరుగుదేశం చైనా (China) మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. గతంలో భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాలను తమ దేశంలో భాగంగా చూపుతూ స్టాండర్డ్ మ్యాప్‌ను విడుదల చేసిన డ్రాగన్‌.. తాజాగా అధునాతన జే-20 ఫైటర్‌ జెట్లను (J-20 Fighter jets) సిక్కిం సమీపంలోని భారత్‌- చైనా (India-China) సరిహద్దుకు 150 కి.మీ. కంటే తక్కువ దూరంలో మోహరించింది. ఈమేరకు జియో స్పేసియల్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవహారాలను పరిశీలించే ‘ఆల్‌ సోర్స్‌ అనాలసిస్‌’ సంస్థ సేకరించిన సమాచారంలో స్పష్టమైంది. మే 27న సంబంధిత సంస్థ శాటిలైట్‌ ద్వారా సేకరించిన చిత్రాలు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఎలాంటి రాడార్లకు చిక్కకుండా, నిశ్శబ్దంగా లక్ష్యాలను ధ్వంసం చేయడం జే-20 ఫైటర్‌ జెట్ల ప్రత్యేకత.

ఆల్‌సోర్స్‌ అనాలసిస్‌ విడుదల చేసిన ఫొటోలను పరిశీలిస్తే.. షిగేట్సే మిలటరీ ఎయిర్‌పోర్టులో చైనా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 6 జే-20 ఫైటర్‌ జెట్‌లు ఫ్లైట్‌ లైన్‌లో ఉన్నాయి. వాటిని ప్రయోగిస్తే భారత్‌ సరిహద్దులోని కొన్ని లక్ష్యాలను ఛేదించడం చైనాకు తేలిక. దీనిపై భారత వైమానిక దళం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఫైటర్‌ జెట్‌లను మోహరించినట్లు మాత్రం తెలిసినట్లు సమాచారం. జే-20 స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌లు చైనాలోనే అత్యంత అధునాతనమైనవి. వీటిని ప్రధానంగా చైనా తూర్పు ప్రావిన్స్‌లో వాడుతారు. తాజాగా టిబెట్‌కు దగ్గరగా వీటిని మోహరించడంపై పలు అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. ఘర్షణ పరిస్థితులు తలెత్తితే వాటిని భారత్‌పై ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది.

అయితే, వాటిని సమర్థంగా తిప్పికొట్టేందుకు భారత్‌ దగ్గర 36 రఫేల్‌ యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిలో 8 విమానాలు ప్రస్తుతం అమెరికా ఎయిర్‌ఫోర్స్‌తో కలిసి సంయుక్త విన్యాసాలు నిర్వహించేందుకు అలస్కాలో ఉన్నాయి. షిగేట్సే విమానాశ్రయం పశ్చిమబెంగాల్‌లోని హసిమరా నగరానికి కేవలం 290 కి.మీ. కంటే తక్కువ దూరంలో ఉంది. ఇక్కడే ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ క్యాంప్‌ ఉంది. ప్రస్తుతం 16 రఫెల్‌ యుద్ధ విమానాలు అక్కడే ఉన్నాయి. ఒకవేళ చైనా ఊహించనివిధంగా దాడికి పాల్పడినా.. భారత్‌ ఎదురుదెబ్బ తీసేందుకు సిద్ధంగా ఉంది. ఇలా చైనా జే-20 జెట్‌లను మోహరించడం ఇదే తొలిసారి కాదు. భారత్‌ను కవ్విస్తూ 2020- 2023 మధ్య కాలంలో పలుమార్లు యుద్ధ విమానాలను అక్కడ నిలిపింది. అయితే, ఇంత పెద్దమొత్తంలో మోహరించడం ఇదే తొలిసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు