CJI: కొవిడ్‌ వేళ ప్రధాని మోదీ సాయపడ్డారు: వెల్లడించిన సీజేఐ

కొవిడ్ సమయంలో ఆయూష్‌(AYUSH) మంత్రిత్వ శాఖ నుంచి అందిన మందులు తనకు ఎంతగానో ఉపకరించాయని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. 

Published : 22 Feb 2024 16:36 IST

దిల్లీ: సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆయూష్‌ హోలిస్టిక్ వెల్‌నెస్‌ సెంటర్‌(AYUSH Holistic Wellness Centre)ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆయూష్‌తో తనకున్న వ్యక్తిగత అనుభవాన్ని వెల్లడించారు. 

‘‘కొవిడ్(Covid) వ్యాప్తి ప్రారంభమైన దగ్గరినుంచి ఆయూష్‌తో అనుబంధం మొదలైంది. ఆ సమయంలో ప్రధాని మోదీ(Modi) ఫోన్‌ చేశారు. ‘కొవిడ్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందనుకుంటున్నాను. ఆయూష్‌ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఒక వైద్యుడు. ఒకసారి మీతో మాట్లాడమని చెప్తాను. మీకు అవసరమైన మందులు పంపుతారు’ అని చెప్పారు. ఆయూష్‌ నుంచి వచ్చిన మందులు నేను తీసుకున్నాను. తర్వాత మళ్లీ కొవిడ్ బారినపడినా.. నేను ఎలాంటి అల్లోపతి మందులు వేసుకోలేదు’’ అని జస్టిస్‌ చంద్రచూడ్ వెల్లడించారు. 

న్యాయమూర్తులతో పాటు వారి కుటుంబాలు, సిబ్బంది అందరికీ సంపూర్ణ జీవనశైలి ముఖ్యమని ఈసందర్భంగా ఆయన వెల్లడించారు.  ‘‘నేను సంవత్సరం క్రితం పంచకర్మ (కేరళ ఆయుర్వేద విధానం) చేయించుకున్నాను. మరోసారి చేయించుకోవాలనుకుంటున్నాను. సుప్రీంలో న్యాయమూర్తులతో సహా 2వేల మంది సిబ్బంది ఉన్నారు. వారంతా రోజువారీ పనిలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వారితో పాటు వారి కుటుంబాలు సంపూర్ణ జీవనశైలిని అనుసరించడం ముఖ్యమని భావిస్తున్నాను. వీరి ద్వారా దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు ఈ సందేశాన్ని ప్రచారం చేయొచ్చు’’ అని అన్నారు. ఈసందర్భంగా వైద్యులు, ఆయూష్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి వైద్య పద్ధతుల సమాహారంగా మంత్రిత్వ శాఖకు ఆయూష్ పేరు పెట్టారు. దీనిని కేంద్రం 2014లో ఏర్పాటుచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు