New CJI: నూతన సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌!

Eenadu icon
By National News Desk Published : 28 Oct 2025 05:26 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేసిన జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌
రాష్ట్రపతి ఆమోదం తర్వాత నియామక ఉత్తర్వులు..
వచ్చే నెల 24న బాధ్యతలు చేపట్టే అవకాశం
తొలి హరియాణావాసిగా రికార్డు

న్యాయశాఖకు పంపిన లేఖ ప్రతిని జస్టిస్‌ సూర్యకాంత్‌కు అందజేస్తున్న సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ 

ఈనాడు, దిల్లీ: భారత సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ నియమితులు కానున్నారు. ఆయన పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. రాష్ట్రపతి ఆయన నియామకాన్ని ఆమోదించాక దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా వచ్చే నెల 24వ తేదీన బాధ్యతలు చేపడతారు. 23వ తేదీన ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ పదవీ విరమణ చేయనున్నారు.ప్రస్తుతం సీనియారిటీలో తన తర్వాతి స్థానంలో ఉన్న జస్టిస్‌ సూర్యకాంత్‌ను తదుపరి సీజేఐగా నియమించాలని సిఫార్సు చేస్తూ కేంద్ర న్యాయశాఖకు జస్టిస్‌ గవాయ్‌ లేఖ పంపారు. దాని ప్రతిని సోమవారమే జస్టిస్‌ సూర్యకాంత్‌కు అందజేశారు. ‘సుప్రీం కోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి పదవికి సీనియర్‌ జడ్జి అయిన జస్టిస్‌ సూర్యకాంత్‌ పేరును సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ సిఫార్సు చేశారు’ అని సుప్రీం కోర్టు విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.  

14 నెలల పదవీకాలం

నవంబరు 24వ తేదీన సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్‌ సూర్యకాంత్‌ 2027 ఫిబ్రవరి 9న పదవీ విరమణ చేస్తారు. అంటే ఆయన దాదాపు 14 నెలలపాటు ఆ పదవిలో కొనసాగుతారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హరియాణా వాసిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ రికార్డు సృష్టించబోతున్నారు. 

చిన్న పట్టణంలో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్‌ సూర్యకాంత్‌.. 1962 ఫిబ్రవరి 10న హరియాణా హిస్సార్‌ జిల్లాలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అక్కడే 1981లో డిగ్రీ పూర్తి చేశారు. 1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్‌ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం హిస్సార్‌ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు. 1985లో పంజాబ్‌ హరియాణా హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్‌ న్యాయవాది హోదా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్‌ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకూ హరియాణా అడ్వకేట్‌ జనరల్‌గా పని చేశారు. 2018 అక్టోబరు 5న హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019 మే 24వ తేదీన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 

2011లో ఆయన కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయ శాస్త్రంలో పీజీ పూర్తి చేశారు. 

కీలక తీర్పుల్లో భాగస్వామి..

రెండు దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పని చేసిన జస్టిస్‌ సూర్యకాంత్‌ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఆయన ఉన్నారు. దీంతోపాటు వాక్‌స్వాతంత్య్రం, అవినీతి, బిహార్‌ ఓటర్ల జాబితా, పర్యావరణం, లింగసమానత్వం వంటి అంశాల్లో ఆయన కీలక తీర్పులను వెలువరించారు. 

  • బ్రిటీష్‌ కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని నిలిపివేస్తూ ఇచ్చిన తీర్పులో జస్టిస్‌ సూర్యకాంత్‌ భాగస్వామి. ఈ చట్టం కింద కొత్తగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయవద్దని ఈ తీర్పులో ఆదేశించారు. 
  • బిహార్‌లో ప్రత్యేక ముమ్మర సవరణలో (సర్‌) భాగంగా 65 లక్షల మంది ఓటర్లను తొలగిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఆయన ధర్మాసనం తీర్పు చెప్పింది. తీసేసిన వారందరి పేర్లను బహిరంగపరచాలని ఆదేశించింది. 
  • సుప్రీంకోర్టుతోపాటు అన్ని కోర్టుల బార్‌ అసోసియేషన్లలో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించాలని ఆయన ఆదేశించారు. 
  • సైనిక దళాల్లో ఒకే ర్యాంకు.. ఒకే పెన్షన్‌ విధానాన్ని సమర్థిస్తూ.. అది రాజ్యాంగపరంగా చెల్లుబాటు అవుతుందని జస్టిస్‌ సూర్యకాంత్‌ తీర్పు చెప్పారు. శాశ్వత సర్వీసుల్లో మహిళా అధికారులను నియమించే పిటిషన్‌పైనా వాదనలను ఆయన వింటున్నారు.
  • అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ మైనారిటీ హోదాను పునఃసమీక్షించేందుకు మార్గాన్ని సుగమం చేస్తూ తీర్పు ఇచ్చిన ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన ఉన్నారు. 
  • పెగాసస్‌పై విచారణ జరిపిన కేసులోనూ జస్టిస్‌ సూర్యకాంత్‌ భాగస్వామి.
  • రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లుల ఆమోదంపై దాఖలైన పిటిషన్ల విచారణ ధర్మాసనంలో ఆయన ఉన్నారు. 
  • ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ ప్రాజెక్టు పర్యావరణ మదింపు కేసు విచారణలోనూ భాగస్వామిగా ఉన్నారు. 
  • దిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు మద్యం కేసులో బెయిలు మంజూరు చేసిన ధర్మాసనంలో జస్టిస్‌ సూర్యకాంత్‌ ఉన్నారు. 
  • సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన 300 ధర్మాసనాల్లో సభ్యుడిగా సేవలందించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని