DK Shivakumar: నా తరఫున ఎవరూ మాట్లాడొద్దు: డీకే శివకుమార్

Eenadu icon
By National News Team Published : 01 Jul 2025 17:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: కర్ణాటక (Karnataka)లో ముఖ్యమంత్రి మార్పు అంశం చర్చనీయాంశంగా మారింది. రెండుమూడు నెలల్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్‌ (DK Shivakumar) సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మద్దతుగా 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఎమ్మెల్యే ఇక్బాల్‌ హుస్సేన్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీకే ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. 

‘‘నా తరఫున ఎమ్మెల్యేలు మాట్లాడాలని కోరుకోవడం లేదు. 2028లో రాష్ట్రంలో జరిగే ఎన్నికలపైనే నేతల దృష్టి ఉండాలి. నేను తొలుత పార్టీ కార్యకర్తను. అన్నింటికంటే పార్టీనే ముఖ్యం. అధిష్ఠానం ఆదేశాలు, పార్టీ మ్యానిఫెస్టో ఆధారంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో పనిచేయాలి. పార్టీలో ఎలాంటి వర్గాలు లేవు. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని ఒక కాంగ్రెస్ మాత్రమే ఉంది’’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి సీఎం కలను మరొకసారి వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. 

రాష్ట్రంలో నాయకత్వ మార్పులేదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్‌ సూర్జేవాలా కూడా వెల్లడించారు. ఈ ఊహాగానాల వెనక భాజపా కుట్ర ఉందని విమర్శించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు నిలిచిపోవాలని ఆ పార్టీ కోరుకుంటోందన్నారు. కర్ణాటక కాంగ్రెస్‌లో వినిపిస్తోన్న అసమ్మతి స్వరాల వేళ అధిష్ఠానం ఆయన్ను రాష్ట్రానికి పంపింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ నాయకత్వ మార్పు ఉండదని స్పష్టం చేశారు.

సిద్ధూకు లాటరీ తగిలింది..

రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతా ఓకే అని సూర్జేవాలా, డీకే ప్రకటించిన తరుణంలో ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో సీనియర్ నేత బీఆర్‌ పాటిల్ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడటం కనిపించింది. ‘‘సిద్ధరామయ్యకు లాటరీ తగిలింది. ఆయన్ను సోనియాగాంధీకి పరిచయం చేసింది నేను. ఆయన అదృష్టం బాగుండి సీఎం అయ్యారు. నాకు ఏ గాడ్‌ ఫాదర్ లేరు. నేను సూర్జేవాలను కలిశాను. చెప్పాల్సిందంతా చెప్పాను. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని ఫోన్‌ మాట్లాడారు. ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు