Delhi: తేజస్వి యాదవ్‌పై పరువునష్టం ఫిర్యాదును కొట్టేసిన సుప్రీం

‘గుజరాతీలు మాత్రమే దొంగలు కాగలరు.’ అని ఆరోపించిన రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్‌జేడీ) నేత తేజస్వీ యాదవ్‌పై వేసిన పరువునష్టం ఫిర్యాదును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టేసింది. 

Updated : 13 Feb 2024 20:26 IST

దిల్లీ: ‘గుజరాతీలు మాత్రమే దొంగలు కాగలరు.’ అని ఆరోపించిన రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్‌జేడీ) నేత తేజస్వీ యాదవ్‌(Tejashwi Yadav)పై వేసిన పరువునష్టం(defamation) ఫిర్యాదును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టేసింది. ఈ కేసు విచారణను గుజరాత్ వెలుపలి కోర్టుకు బదిలీ చేయాలంటూ బిహార్ మాజీ డిప్యూటీ సీఎం వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

తాను చేసిన వ్యాఖ్యను ఉపసంహరించుకుంటూ యాదవ్ జనవరి 19న సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థనను విచారించిన అత్యున్నత న్యాయస్థానం పరువునష్టం ఫిర్యాదుపై విచారణను నిలిపేస్తూ, కేసు దాఖలు చేసిన గుజరాత్ వాసికి నోటీసు జారీ చేసింది.  అహ్మదాబాద్ కోర్టులో తనపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ పరువునష్టం ఫిర్యాదును ఇతర ప్రాంతాల కోర్టుకు, వీలయితే దిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఫిబ్రవరి 5న సుప్రీంకోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. 

స్థానిక వ్యాపారవేత్త, కార్యకర్త అయిన హరీష్‌ మెహతా యాదవ్‌పై పరువు నష్టం కేసు దాఖలు చేయడంతో గుజరాత్‌ కోర్టు 2023 అగస్టులో ప్రాథమిక విచారణ చేపట్టింది. ఫిర్యాదు ప్రకారం తేజస్వి యాదవ్‌ 2023 మార్చిలో పట్నాలో మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో గుజరాతీయులు మాత్రమే దొంగలు కాగలరు. ఎందుకంటే వారు చేసే మోసాలను క్షమిస్తారు. వారు బ్యాంకులకు చెల్లించాల్సిన డబ్బుతో పారిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు.’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు గుజరాతీయులను కించపరిచేలా ఉన్నాయని మెహతా ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని