Delhi: దిల్లీ రికార్డు ఉష్ణోగ్రత.. సెన్సర్ ఎర్రర్‌ కారణం: కేంద్రం

దేశ రాజధాని దిల్లీ (Delhi)లో నమోదైన రికార్డు ఉష్ణోగ్రతలపై కేంద్రం తాజాగా స్పష్టత ఇచ్చింది. సెన్సర్ సమస్యే అందుకు కారణమని తెలిపింది. 

Published : 01 Jun 2024 18:26 IST

దిల్లీ: ఈ ఏడాది భానుడి ప్రతాపానికి దేశ ప్రజలు అల్లాడిపోయారు. ఇటీవల దిల్లీ (Delhi)లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముంగేశ్‌పుర్‌లో వాతావరణ స్టేషన్‌లో అత్యధికంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చూపించింది. దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది. దానికి సెన్సార్‌ సరిగా పని చేయకపోవడమే కారణమని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా వెల్లడించారు.

‘‘మే 29న ముంగేశ్‌పుర్‌లో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీనిపై భారత వాతావరణ విభాగం విచారణ జరిపింది. మూడు డిగ్రీల సెన్సర్‌ ఎర్రర్‌ను అధికారులు గుర్తించారు. సిబ్బంది దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కచ్చితమైన ఉష్ణోగ్రతల సమాచారం ఇచ్చేందుకు మేం కృషి చేస్తున్నాం’’  అని మంత్రి తెలిపారు. ఈ రికార్డు ఉష్ణోగ్రతపై ఇటీవల ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం.మహాపాత్ర స్పందించిన సంగతి తెలిసిందే. సెన్సర్‌ పనితీరును పరిశీలిస్తున్నట్లు అప్పుడు చెప్పారు.

దిల్లీలో ఉష్ణోగ్రతలు కొలిచేందుకు 20 చోట్ల మానిటరింగ్‌ స్టేషన్లు ఏర్పాటుచేశామని, అందులో ముంగేశ్‌పుర్‌లో అత్యధికంగా 52.9 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనట్లు చూపించిందన్నారు. ఈ స్థాయిలో ఉష్ణోగ్రత ఇప్పటివరకు నమోదు కాలేదన్నారు. దిల్లీలో ఏర్పాటుచేసిన వాతావరణ కేంద్రాల్లో 14 చోట్ల ఉష్ణోగ్రతలు తగ్గాయని, కొన్నిచోట్ల 45-50 మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. మిగతా వాటితో పోలిస్తే ముంగేశ్‌పుర్‌లో నమోదైన డేటా భిన్నంగా ఉందన్నారు. సెన్సర్‌లో సమస్యే అందుకు కారణమని తాజాగా వెల్లడైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని