Cloud Seeding: కృత్రిమ వర్షానికి దిల్లీ రెడీ..క్లౌడ్‌ సీడింగ్‌ ప్రక్రియ పూర్తి

Eenadu icon
By National News Team Updated : 28 Oct 2025 16:54 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్: దేశ రాజధాని దిల్లీని తీవ్ర వాయు కాలుష్యం (Air Pollution) వేధిస్తోంది. దీపావళి అనంతరం పరిస్థితులు మరింత దిగజారాయి. మంగళవారం దిల్లీలో వాయు నాణ్యత సూచీ (AQI) 306గా నమోదు అయినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) వెల్లడించింది. ఇది తీవ్రమైన కాలుష్య కేటగిరిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు స్థానికంగా కృత్రిమ వర్షం (Artificial Rains) కురిపించేందుకు దిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా  ‘క్లౌడ్ సీడింగ్ (Cloud Seeding)’ ప్రక్రియను పూర్తి చేసింది. ఐఐటీ కాన్పూర్‌ నుంచి బయల్దేరిన ఎయిర్‌ క్రాఫ్ట్‌ సిల్వర్‌ అయోడైడ్‌, పొటాషియం అయోడైడ్‌ లాంటి రసాయన ఉత్ప్రేరకాలను వివిధ ప్రాంతాల్లోని మేఘాలపై చల్లి క్లౌడ్‌ సీడింగ్‌ ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో మరికొన్ని గంటల్లో వర్షం పడే అవకాశం ఉంది.

నగరంలో ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించడానికి దిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 25న ఐఐటీ కాన్పూర్‌తో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం.. అక్టోబర్ 1 నవంబర్ 30 మధ్య ఎప్పుడైనా ట్రయల్స్ నిర్వహించడానికి పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (DGCA) అనుమతిచ్చింది. ఈ ప్రక్రియను నిర్వహించడానికి కావాల్సిన రూ.3.21 కోట్ల బడ్జెట్‌ను దిల్లీ మంత్రివర్గం మేలో ఆమోదించింది. అయితే, ప్రతికూల వాతావరణం, రుతుపవన పరిస్థితుల కారణంగా ఈ ప్రక్రియ పలుమార్లు వాయిదా పడింది.

కృత్రిమ వర్షాలు ఎలా కురిపిస్తారు?

తొలుత శాస్త్రవేత్తలు కృత్రిమ వర్షానికి అనువైన మేఘాలను గుర్తిస్తారు. వాటిలో సరిపడా తేమ ఉంటుంది. కానీ, వర్షించేందుకు అనువైన పరిస్థితులు ఉండవు. అలాంటి సందర్భంలో.. సిల్వర్‌ అయోడైడ్‌, పొటాషియం అయోడైడ్‌ లాంటి రసాయన ఉత్ప్రేరకాలను మేఘాలపై చల్లి.. క్లౌడ్‌ సీడింగ్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. ఇవి మేఘాల్లోని తేమను కరిగించి.. వర్షపు బిందువుల రూపంలో కింద పడేందుకు సహకరిస్తాయి. కొన్ని సార్లు పొడి మంచును కూడా వినియోగిస్తారు. దీనివల్ల మేఘాలు చల్లబడి వర్షం (Artificial Rains) కురిసేందుకు వీలుంటుంది.

Tags :
Published : 28 Oct 2025 15:53 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు