EC: పోలింగ్ కేంద్రాల వారీగా డేటాను వెల్లడిస్తే గందరగోళమే: సుప్రీంకు ఈసీ అఫిడవిట్‌

EC affidavit to SC: పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటింగ్ శాతాల వివరాలను వెబ్‌సైట్‌లో ప్రచురించడం వల్ల ఎన్నికల యంత్రాంగం గందరగోళంలో పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Updated : 23 May 2024 11:37 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వివిధ దశల్లో నమోదవుతున్న పోలింగ్‌ శాతాలపై కచ్చితమైన అధికారిక (voter turnout data) సమాచారాన్ని ఎన్నికల సంఘం (Election Commission) సకాలంలో ఇవ్వలేకపోవడంపై విమర్శలొస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court)లోనూ పిటిషన్‌ దాఖలైంది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో పోలింగ్ కేంద్రాల వారీగా డేటాను వెబ్‌సైట్లో వెల్లడిస్తే అది గందరగోళ పరిస్థితులకు దారితీస్తుందని పేర్కొంది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి అఫిడవిట్‌ దాఖలు చేసింది.

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) ప్రథమ, ద్వితీయ దశల పోలింగ్‌ శాతాలను అధికారికంగా వెల్లడించడంలో తీవ్ర జాప్యం జరగడం, ఆ గణాంకాలను సవరించడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రతి విడతలో పోలింగ్‌ ముగిసిన 48 గంటల్లోనే కేంద్రాలవారీ ఓటింగ్‌ శాతాలను ఈసీ (EC) వెబ్‌సైట్‌లో ప్రచురించేలా చూడాలని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ సుప్రీంకోర్టు (SC)లో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. ఈసీకి కీలక ప్రశ్నలు సంధించింది. వీటికి వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

మార్ఫింగ్ ముప్పు..

ఈ క్రమంలోనే ఈసీ (poll panel) బుధవారం కోర్టుకు 225 పేజీల్లో తమ వివరణ సమర్పించింది. ‘‘ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో పడిన ఓట్ల సంఖ్యను తెలిపే ‘ఫామ్‌ 17సీ’ పత్రాన్ని బహిర్గతం చేయాలని నిబంధనల్లో లేదు. ప్రస్తుతం ఈ 17సీ ఒరిజినల్‌ను స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రపరుస్తున్నాం. కేవలం పోలింగ్‌ ఏజెంట్‌కు మాత్రమే దాని కాపీని పొందేందుకు అనుమతి ఉంటుంది. అది కూడా వారి సంతకంతో ఇస్తాం. అలా కాకుండా.. పిటిషనర్‌ కోరినట్లుగా పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటింగ్‌ శాతాన్ని బహిరంగంగా ప్రచురిస్తే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది. వాటి చిత్రాలను, కౌంటింగ్‌ ఫలితాలను మార్ఫింగ్ చేసే ప్రమాదం ఉంది. ఈ డేటాను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడం వల్ల ఎన్నికల యంత్రాంగంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. దీని వల్ల మొత్తం ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడుతుంది’’ అని ఈసీ సమాధానంలో పేర్కొంది. ఈ ఫామ్‌ 17సీని ఏ సంస్థకు ఇచ్చేందుకు అనుమతులు లేవని స్పష్టం చేసింది.

ఇక తొలి రెండు దశల్లో పోలింగ్ శాతాలపై పిటిషనర్‌ చేసిన ఆరోపణలను కూడా ఈసీ కొట్టిపారేసింది. అవన్నీ అవాస్తవమని, తప్పుదోవ పట్టించేవని ఆరోపించింది. ‘‘పోలింగ్ డేటాలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి. 2019లోనూ ఇదే తరహా ఆరోపణలతో పిటిషన్లు దాఖలయ్యాయని చెబుతున్నారు. అందుకు ఒక్క ఉదాహరణ కూడా వారు ప్రస్తావించలేదు. కేవలం అనుమానంతో మాత్రమే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని స్పష్టమవుతోంది’’ అని ఈసీ పేర్కొంది.

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 19న ముగిసినా.. పోలైన ఓట్ల సంఖ్యను 11 రోజుల తరవాత-ఏప్రిల్‌ 30న ప్రచురించారు. ఏప్రిల్‌ 26న జరిగిన రెండో దశ పోలింగ్‌ శాతాన్ని నాలుగు రోజుల తరవాత ప్రచురించారు. పోలింగ్‌ రోజున ఎన్నికల సంఘం వెల్లడించిన ఓటింగ్‌ శాతం కన్నా కొంత అధికంగా ఏప్రిల్‌ 30న గణాంకాలు కనిపించాయి. దీనిపై విమర్శలు రావడంతో.. ఏడీఆర్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ మే 24న జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని