DK Shivakumar: నాకు ఇంకో దారి లేదు: ‘సీఎం పదవి’పై డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

Eenadu icon
By National News Team Updated : 02 Jul 2025 14:24 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్: కర్ణాటక (Karnataka)లో నాయకత్వ మార్పు అంశంపై కొన్ని రోజులుగా వినిపిస్తోన్న వ్యాఖ్యలకు చెక్ పడింది. ఐదేళ్లు తానే కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సిద్ధరామయ్య (Siddaramaiah) స్పష్టంచేశారు. ‘‘నేను సీఎంగా కొనసాగుతా. మీకెందుకు అలాంటి అనుమానాలు ఉన్నాయి..?’’ అని బుధవారం పాత్రికేయులకు వెల్లడించారు. సీఎం మార్పు గురించి విపక్ష పార్టీలు భాజపా, జేడీఎస్ చేస్తోన్న వ్యాఖ్యలను కొట్టిపారేశారు. వారేమైనా కాంగ్రెస్‌ అధిష్ఠానమా అని ప్రశ్నించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) మాట్లాడుతూ..‘ ఆయన(సీఎం)కు అండగా ఉండటం తప్ప నాకు ఇంకో ఆప్షన్ లేదు. నేను ఆయనకు మద్దతు ఇవ్వాలి. అధిష్ఠానం ఏం చెబితే అది చేయాలి’’ అని మాట్లాడారు.

ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మరో రెండు, మూడు నెలల్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశముందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ఎవరు కృషి చేశారో అందరికీ తెలుసని.. ప్రస్తుతం పార్టీ అధిష్ఠానం శివకుమార్‌ గురించే మాట్లాడుతోందన్నారు. సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ‘విప్లవాత్మక’ పరిణామాలు నెలకొంటాయని కర్ణాటక మంత్రి కె.ఎన్.రాజన్న కూడా ఇటీవల పేర్కొన్నారు. దీంతో త్వరలోనే నాయకత్వ మార్పు తథ్యమని అధికార పార్టీలోనూ విస్తృత చర్చ నడిచింది. 

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు రెండున్నరేళ్ల పాటు పదవిలో కొనసాగేలా అంగీకారానికి వచ్చారనే వార్తలూ వచ్చాయి. పలు కేసుల్లో సిద్ధరామయ్య పేరు బయటకు రావడంతో సీఎంగా ఆయనను తొలగించాలన్న డిమాండ్లు తెర పైకి వస్తున్నాయి. శివకుమార్‌ కూడా ఎప్పటికైనా ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తాననే బహిరంగంగానే చెబుతున్నారు. ఆ నేపథ్యమూ ఈ చర్చకు దారితీసింది.

అయితే వ్యాఖ్యలను డీకే శివకుమార్‌, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్‌ సూర్జేవాలా ఇప్పటికే ఖండించిన సంగతి తెలిసిందే. ‘‘నా తరఫున ఎమ్మెల్యేలు మాట్లాడాలని కోరుకోవడం లేదు. 2028లో రాష్ట్రంలో జరిగే ఎన్నికల పైనే నేతల దృష్టి ఉండాలి. నేను తొలుత పార్టీ కార్యకర్తను. అన్నింటికంటే పార్టీనే ముఖ్యం’’ అని డీకే స్పష్టంచేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు లేదని సూర్జేవాలా వెల్లడించారు. ఈ ఊహాగానాల వెనక భాజపా కుట్ర ఉందని విమర్శించారు.

Tags :
Published : 02 Jul 2025 13:50 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు