Siddaramaiah: అవును.. నేను అదృష్టవంతుడినే: సీఎం సిద్ధరామయ్య

Eenadu icon
By National News Team Published : 02 Jul 2025 00:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

బెంగళూరు: తనను అదృష్టవంతుడిగా పేర్కొంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) స్పందించారు. ‘అవును.. నేను అదృష్టవంతుడినే. అందుకే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను’ అన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ పట్ల అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌.. మంగళవారం ‘‘సిద్ధరామయ్య లాటరీ కొట్టారు. ఆయన్ను సోనియాగాంధీకి పరిచయం చేసింది నేను. ఆయన అదృష్టం బాగుండి సీఎం అయ్యారు. నాకు ఏ గాడ్‌ ఫాదర్ లేరు. నేను సూర్జేవాలాను కలిసి చెప్పాల్సిందంతా చెప్పా. ఏం జరుగుతుందో చూద్దాం’’ అంటూ చేసిన వ్యాఖ్యల వీడియో చర్చనీయాంశంగా మారడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పైవిధంగా స్పందించారు. 

మరోవైపు, తన నియోజకవర్గం అలంద్‌లో పేదలకు ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందంటూ ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌ ఇటీవల ఆరోపించారు. వీటిని తోసిపుచ్చిన గృహనిర్మాణ శాఖ మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఖాన్ కేటాయింపులు పారదర్శకంగానే జరుగుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పాటిల్‌ విమర్శల తర్వాత మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజు కాజే, బేలూర్ గోపాల కృష్ణ సైతం తమ సొంత ప్రభుత్వంపై అసంతృప్తిని బయటపెట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో సీఎం మార్పు ఊహాగానాలు, పార్టీలో ఉన్న అసమ్మతిని నియంత్రించేందుకు అధిష్ఠానం ఆదేశాల మేరకు రణ్‌దీప్‌ సూర్జేవాలా బెంగళూరు చేరుకొని ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా సూర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నాయకత్వ మార్పులేదని స్పష్టం చేశారు. సీఎం మార్పు ఊహాగానాల వెనక భాజపా కుట్ర ఉందని విమర్శించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు నిలిచిపోవాలని ఆ పార్టీ కోరుకుంటోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు