Pre Wedding Shoot: ఆపరేషన్‌ గదిలో ప్రీవెడ్డింగ్‌ షూట్‌.. వైద్యుడి సస్పెండ్‌

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడు తన ప్రీవెడ్డింగ్‌ షూట్‌ను ఆపరేషన్‌ గదిలో ఏర్పాటు చేశాడు. కర్ణాటక రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

Updated : 10 Feb 2024 13:59 IST

హైదరాబాద్‌: ‘వైద్యో నారాయణో హరి’ అంటారు. దేవుడితో సమానంగా భావించే ఓ వైద్యుడు తన వృత్తిధర్మాన్ని మరచి ఏకంగా ఆసుపత్రిలోనే ప్రీవెడ్డింగ్‌ షూట్‌ (Pre Wedding Shoot) ఏర్పాటు చేశాడు. కర్ణాటక (Karnataka)లోని చిత్రదుర్గ జిల్లాలోని ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. దీంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఆ వైద్యుడిని తక్షణమే విధుల్లోంచి తొలగించింది. ఫొటోషూట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

వివాహనికి ముందు ప్రీవెడ్డింగ్‌ల పేరిట కొత్త ట్రెండ్‌ మొదలైన ఈ రోజుల్లో కర్ణాటకకు చెందిన యువ వైద్యుడు వినూత్నంగా ఆలోచించాడు. భరంసాగర్‌ ఏరియాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒప్పంద వైద్యుడిగా పనిచేస్తున్న అతడు.. ఆపరేషన్‌ థియేటర్‌ గదినే అందుకు వేదికగా ఉపయోగించుకున్నాడు. ఇంకేముంది తన భాగస్వామితో కలిసి ఓ రోగికి శస్త్రచికిత్స చేస్తున్నట్లుగా ఫొటోలు, వీడియోలు తీయించుకున్నాడు. ఇది వైద్యవర్గాల్లో చర్చనీయాంశం కావడంతో ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో కర్ణాటక వైద్యారోగ్యశాఖ మంత్రి దినేశ్‌ గుండు రావ్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా స్పందించారు. ఆసుపత్రిలో ప్రీవెడ్డింగ్‌ షూట్‌ నిర్వహించిన సదరు వైద్యుడిని తక్షణమే సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 

ప్రభుత్వ ఆసుపత్రులను నెలకొల్పింది ప్రజలకు వైద్యాన్ని అందించడానికి మాత్రమే అని, వాటిని వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి కాదని మంత్రి పేర్కొన్నారు. వైద్యులు తమ వృత్తిని మరచి క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడితే సహించేది లేదన్నారు. హెల్త్‌ కేర్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఒప్పంద ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది తమ సర్వీస్‌ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచించానని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా నడుచుకోవాలని చెప్పానన్నారు. సామాన్య ప్రజల కోసమే ప్రభుత్వం వైద్య సదుపాయాలు కల్పిస్తోందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని విధి నిర్వహణపై ప్రతిఒక్కరూ దృష్టిసారించాలని మంత్రి పేర్కొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని