LS Polls: నిష్పక్షపాత ఎన్నికలకు.. ఈసీ చెప్పిన ‘‘4M ఫార్ములా’’

ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్ల విషయంలో ‘4ఎం (4M)’లను సీఈసీ రాజీవ్‌కుమార్ ప్రస్తావించారు. వాటిని ‘మజిల్‌, మనీ, మిస్‌ఇన్ఫర్మేషన్‌, ఎంసీసీ వయలేషన్‌ (అధికార బలం, డబ్బు, తప్పుడు సమాచారం, ఎన్నికల నియామవళి ఉల్లంఘన)గా పేర్కొన్నారు.

Updated : 16 Mar 2024 22:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రానున్న సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections)ను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) తెలిపింది. హింసాత్మక ఘటనలపై ఉక్కుపాదం మోపుతామని సీఈసీ రాజీవ్‌ కుమార్‌ (CEC Rajiv Kumar) స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్ల విషయంలో ‘4ఎం (4M)’లను ప్రస్తావించారు. ‘మజిల్‌, మనీ, మిస్‌ఇన్ఫర్మేషన్‌, ఎంసీసీ వయలేషన్‌ (అధికార బలం, డబ్బు, తప్పుడు సమాచారం, ఎన్నికల నియామవళి ఉల్లంఘన)పై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

నగదు దుర్వినియోగంపై డేగకన్ను..!

‘‘కొన్ని రాష్ట్రాల్లో అధికార, ధనబలాలు సమస్యగా ఉంటే.. మరికొన్నిచోట్ల భౌగోళిక సమస్యలు ఉన్నాయి. అయితే.. పోలింగ్‌ ప్రక్రియకు అంతరాయం కలిగించే సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాం’’ అని సీఈసీ తెలిపారు. ‘‘హింస దేనికీ పరిష్కారం కాదు. శాంతి మాత్రమే శాశ్వతం’’ అంటూ మహాత్మాగాంధీ మాటలను ఉటంకించారు. ధన ప్రవాహాన్ని అడ్డుకుంటామని చెప్పారు. 2022-23 మధ్యకాలంలో 11 రాష్ట్రాల ఎన్నికల్లో నగదు జప్తు గతంతో పోలిస్తే 835 శాతం పెరిగిందని, దాదాపు రూ.3,400 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మద్యం, ఇతర ప్రలోభాల రూపంలో నగదు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కోస్ట్‌ గార్డ్‌, జీఎస్టీ, పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నట్లు చెప్పారు.

ఏప్రిల్‌ 19 నుంచి లోక్‌సభ పోలింగ్‌

‘‘ప్రస్తుత డిజిటల్‌ యుగంలో తప్పుడు సమాచారాన్ని అరికట్టడం సవాల్‌గా మారింది. ఫేక్‌ న్యూస్‌ను మొదట్లోనే తుంచేందుకు కొన్ని చర్యలు తీసుకున్నాం. నకిలీ వార్తలను ఎప్పటికప్పుడు అరికడుతున్నాం. తప్పుడు సమాచారాన్ని సృష్టించేవారిపై చట్టప్రకారం చర్యలుంటాయి. ఏదైనా విషయాన్ని ఇతరులతో పంచుకునేముందు నిర్ధరించుకోవాలి. నకిలీ వార్తలను ఎదుర్కొనే మంత్రం ఇదే. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక వర్గాలపై ఆధారపడాలి. అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడే విషయంలో ఈసీకి సహకరించాలి’’ అని ప్రజలకు సీఈసీ విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు