Cash-for-Job Scam: ఒక్కో ఉద్యోగానికి రూ.35 లక్షలు.. వెలుగులోకి భారీ జాబ్‌ స్కామ్‌..!

Eenadu icon
By National News Team Published : 29 Oct 2025 13:56 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో భారీ కుంభకోణం బయటపడింది. రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ వాటర్‌ సప్లై విభాగంలో ఉద్యోగాల కోసం రూ.25-35లక్షల చొప్పున ముడుపులు తీసుకున్నట్లు తెలిసింది. ఓ మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చేపట్టిన సోదాల్లో ఈ జాబ్‌ స్కామ్‌ (Cash-for-Job Scam)ను గుర్తించిన అధికారులు.. దీనిపై తమిళనాడు (Tamil Nadu) పోలీసు విభాగానికి తాజాగా లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ఈ కుంభకోణం వెనక శక్తిమంతమైన రాజకీయ నాయకులు, ప్రముఖులు ఉన్నారని ఈడీ అధికారులు ఆరోపించినట్లు సమాచారం.

రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ వాటర్‌ సప్లై విభాగంలోని అసిస్టెంట్ ఇంజినీర్లు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, జూనియర్‌ ఇంజినీర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తదితర పోస్టుల కోసం 2024లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభించారు. దాదాపు 1.12 లక్షల మంది ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి నియామక పరీక్ష నిర్వహించి 2,538 మందిని ఎంపిక చేశారు. ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) స్వయంగా వీరికి నియామక ఉత్తర్వులు అందజేశారు.

అయితే, ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు ఈడీ (ED) ఆరోపించింది. దాదాపు 150 మంది అభ్యర్థులకు అనుకూలంగా పరీక్షలో రిగ్గింగ్‌కు పాల్పడినట్లు పేర్కొంది. ఇందుకోసం ఆయా అభ్యర్థుల నుంచి రూ.25-35లక్షల చొప్పున లంచాలు తీసుకున్నట్లు తెలిపింది. దీని వెనక రాష్ట్రంలోని కీలక రాజకీయ నాయకులు, కొన్ని సంస్థలు ఉన్నట్లు ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేయాలని కోరుతూ తమిళనాడు హెడ్‌ ఆఫ్‌ పోలీస్‌ ఫోర్స్‌కు ఈడీ లేఖ రాసింది. ఈ ఆరోపణలకు సంబంధించి 232 పేజీల ఆధారాలను సమర్పించింది. ఈ పరీక్ష నిర్వహించిన అన్నా యూనివర్సిటీపై దర్యాప్తు చేయాలని  ఈడీ కోరినట్లు ఆ కథనం వెల్లడించింది.

దీంతో ఈ వ్యవహారం కాస్తా రాజకీయ దుమారం రేపింది. ఈ కథనాన్ని ప్రముఖ నటుడు విజయ్‌ పార్టీ టీవీకే తమ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. అయితే, ఈ వార్తలపై తమిళనాడు ప్రభుత్వం గానీ.. సీఎం స్టాలిన్‌ గానీ ఇంతవరకూ స్పందించలేదు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ కుంభకోణం అంశం కీలకంగా మారనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు