Sabarimala Gold Theft: బంగారాన్ని.. ‘రాగి’గా మార్చి: శబరిమల కేసులో మరో అరెస్టు

Eenadu icon
By National News Team Updated : 01 Nov 2025 14:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప దేవాలయంలోని విగ్రహాల బంగారు తాపడం బరువులో వ్యత్యాసం చోటుచేసుకున్న కేసు (Sabarimala Gold Theft)లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పారిశ్రామికవేత్త ఉన్నికృష్ణన్‌ పొట్టికి సహకరించిన మాజీ ఆలయాధికారిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం ట్రావెన్‌కోర్‌ దేవస్థానం (టీడీబీ) బోర్డు మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుదేశ్‌ కుమార్‌ను విచారించిన అనంతరం అరెస్టు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు వెల్లడించారు.

శిల్పాలపై ఉన్న బంగారు పూత పూసిన పొరలు పసిడితో తయారుచేసినవని తెలిసినప్పటికీ సుదేశ్‌కుమార్ అధికారిక పత్రాలలో వాటిని రాగితో చేసిన తాపడాలుగా నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ ఐడీ కార్డులో పలు మార్పులు చేసి.. ఆయన బంగారాన్ని దొంగిలించడానికి సహాయం చేసినట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో మరో నిందితుడు మురారిబాబుకు కూడా బంగారం దొంగతనంలో సహాయం చేసినట్లు సుదేశ్‌పై ఆరోపణలు ఉన్నాయన్నారు. శనివారం అతడిని కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. 

ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్‌ 2004-2008 మధ్య శబరిమల ఆలయ పూజారికి సహాయకుడిగా పనిచేశాడు. అక్కడి ద్వారపాలకుల విగ్రహాలకు అమర్చిన రాగి రేకులకు 1998లో బంగారు తాపడం చేసిన విషయం తెలుసుకున్నాడు. కాలక్రమంలో బెంగళూరులో వ్యాపారిగా స్థిరపడిన ఉన్నికృష్ణన్‌ పొట్టి ఆలయ తాపడాల బంగారాన్ని తస్కరించడానికి ప్రణాళిక వేశాడు. బంగారు తాపడాలకు మెరుగులుదిద్దుతానని ప్రతిపాదించడంతో ఆలయ నిర్వాహకులు 2019లో ఆ పనిని అతడికి అప్పగించారు. తాపడాలను చెన్నైలోని ఓ సంస్థకు తీసుకెళ్లి వాటి నుంచి బంగారాన్ని తొలగించాడు. ఆ తర్వాత వాటిని తిరిగి అమర్చగా.. తాపడాలపై ఉన్న బంగారం బరువు 476 గ్రాములు తగ్గిన విషయం తాజాగా బయటపడింది. దీంతో ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 

 

Tags :
Published : 01 Nov 2025 10:51 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని