Prashant Kishor: అయితే 150.. లేదంటే 10 సీట్లు: ప్రశాంత్‌ కిశోర్‌

Eenadu icon
By National News Team Updated : 01 Nov 2025 10:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జన్‌ సురాజ్ పార్టీ (Jan Suraaj Party) వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి 150 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. ఒకవేళ ప్రజలు తిరస్కరిస్తే 10 కంటే తక్కువ సీట్లకే పరిమితం కావొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఈ మేరకు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు (Assembly Elections). 

ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవొచ్చని అంచనా వేస్తున్నారని ప్రశాంత్‌ కిశోర్ (Prashant Kishor)కు ప్రశ్న ఎదురైంది. ‘‘ఇక్కడ నేను రెండు అవకాశాలు ఉండొచ్చని అనుకుంటున్నాను. ప్రజలు జన్‌సురాజ్‌ను ఒక ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. అయితే దీర్ఘకాలంగా నిరాశావాదాన్ని చూసిన ఓటర్లు ముందడుగు వేయడానికి విశ్వాసం అవసరం’’ అని అన్నారు. ‘‘నేను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఎన్నడూ ధ్రువీకరించలేదు. ఒకవేళ నేను పోటీచేస్తే.. కర్గాహర్ నుంచి బరిలో ఉంటానని చెప్పాను. నేనేమీ ఎక్స్ ఫ్యాక్టర్ కాదు. ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న వెల్లడి కానున్నాయి. ఎన్నికల్లో విజయం గురించి ఆలోచించేటప్పుడు.. జన్‌సురాజ్ గెలిచిన సీట్లను చూస్తారా..? లేక నేను పోటీ చేశానా లేదా అనే దానిని చూస్తారా? బిహార్‌లో మహాగఠ్‌బంధన్‌ లేక ఎన్డీయేకు ప్రత్యామ్నాయం లేదనే అభిప్రాయం ఉంది. అభిప్రాయం వేరు.. వాస్తవం వేరు. 

బిహార్‌ (Bihar News)లో మూడింట ఒకవంతు మంది ఈ రెండు కూటములకు ఓటు వేయాలని అనుకోవడం లేదు. 160-170 సీట్లలో జన్‌సురాజ్ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు’’ అని తాను పోటీ చేయకపోవడం గురించి సమాధానమిచ్చారు. అలాగే పొత్తుల గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ ఎన్నికల ఫలితాల తర్వాత జన్‌సురాజ్‌ కింగ్‌ మేకర్‌గా ఎదిగినా.. వారితో పొత్తు, వీరితో పొత్తు అంటూ రాజకీయాలు చేయబోం. ప్రజలు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే.. మా పని మేం కొనసాగిస్తాం. ఇది నేను మీకు రాసిస్తాను. ఎన్నికల ముందు, తర్వాత మేం ఎలాంటి పొత్తులు పెట్టుకోం. ఒకవేళ హంగ్ ఏర్పడి మేం లేకుండా ప్రభుత్వం ఏర్పాటుచేయలేని పరిస్థితి వస్తే.. నేతలు పార్టీలు మారతారు. అది నాకు తెలుసు. వారిని నేను ఆపలేను. డబ్బు, కేసుల భయం అందుకు కారణం కావొచ్చు’’ అని విమర్శించారు. రాష్ట్రంలో వచ్చేనెల 6, 11వ తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. నవంబరు 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Tags :
Published : 01 Nov 2025 09:48 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు