తాజ్‌ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు.. ప్రయాణికులంతా సేఫ్‌!

తాజ్‌ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీకాలేదని అధికారులు వెల్లడించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Published : 03 Jun 2024 19:14 IST

దిల్లీ: తాజ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. ఆగ్నేయ దిల్లీలోని సరితా విహార్‌ వద్ద మూడు రైలు బోగీల్లో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణికులు హుటాహుటిన బయటకు వచ్చేయడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితమేనని తెలిపారు. ఓఖ్లా - తుగ్లకాబాద్ మధ్య సర్వీసులందిస్తున్న ఈ రైలులో నాన్-ఏసీ ఛైర్ కార్ D3 కోచ్‌ నుంచి అగ్నికీలలు ఎగసిపడినట్లు నార్తన్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ శోభన్‌ చౌధరి తెలిపారు. ఆ తర్వాత మరో రెండు కోచ్‌లకు వ్యాపించాయని పేర్కొన్నారు. అయితే, మంటలు చెలరేగడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం 4.24గంటల సమయంలో తాజ్‌ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు వ్యాపించినట్లు సమాచారం అందింది. ఎనిమిది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేశాం. ముందు నాలుగు కోచ్‌ల్లో మంటలు చెలరేగినట్లు పీసీఆర్‌ కాల్‌ వచ్చింది. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోగా.. మూడు కోచ్‌లకు మంటలు వ్యాపించినట్లు గుర్తించాం. డీ3, డీ4 కోచ్‌లు మంటల్లో కాలిపోగా.. డీ2 కోచ్‌ మాత్రం పాక్షికంగా కాలింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు’’ అని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని