Gautam Adani: వారికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం: వివాహం వేళ అదానీ తనయుడి వినూత్న కార్యక్రమం

Eenadu icon
By National News Team Published : 05 Feb 2025 17:58 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ (Gautam Adani) ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన చిన్న కుమారుడు జీత్‌ అదానీ (Jeet Adani)కి, దివా జైమిన్‌ షా (Diva Jaimin Shah)తో ఫిబ్రవరి ఏడున వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో వారు పలు సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సమయంలో జీత్ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గౌతమ్ అదానీ వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

‘‘జీత్‌, దివా పవిత్ర సంకల్పంతో వారి వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రతి సంవత్సరం 500 మంది దివ్యాంగ సోదరీమణులకు వివాహం నిమిత్తం ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇది సంతోషకర విషయం. ఒక తండ్రిగా ఈ మంగళసేవ నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ ప్రయత్నం ద్వారా దివ్యాంగులైన ఆడబిడ్డలు, వారి కుటుంబాలు ఆనందం, గౌరవంతో ముందుకుసాగుతాయనే నమ్మకం కలుగుతోంది. ఈ సేవా మార్గంలో జీత్‌, దివా ముందుకు సాగేందుకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను’’ అని అదానీ సంతోషం వ్యక్తంచేశారు. మంగళ సేవకు సంబంధించిన చిత్రాలను షేర్ చేశారు.

జీత్‌ అదానీ.. యూనివర్శిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా నుంచి ఇంజనీరింగ్‌ అండ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌లో పట్టా పొందారు. 2019లో అదానీ గ్రూప్‌లో చేరారు. స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్, క్యాపిటల్ మార్కెట్స్‌ వంటి విభాగాల బాధ్యతలు చూస్తున్నారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ వ్యాపారంతో పాటు అదానీ డిజిటల్‌ ల్యాబ్స్‌కు కూడా నాయకత్వం వహిస్తున్నారు. దివా.. గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్‌ షా కుమార్తె.

ఫిబ్రవరి 7న నిరాడంబరంగా, సంప్రదాయ పద్ధతిలో జీత్ వివాహం జరగనుందని తెలుస్తోంది. ఎలాన్‌ మస్క్, బిల్‌ గేట్స్‌ వంటి అంతర్జాతీయ ప్రముఖులను ఈ వివాహ వేడుకకు అదానీ ఆహ్వానిస్తున్నారని, టేలర్‌ స్విఫ్ట్‌ ప్రదర్శన ఉండబోతోందని సామాజిక మాధ్యమాల్లో ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై అదానీ ఇటీవల స్పష్టత ఇచ్చారు. అలాంటిది ఏమీ లేదని కుంభమేళాకు హాజరైన సందర్భంగా ఆయన వెల్లడించారు. 2023 మార్చిలో దివాతో జీత్‌ నిశ్చితార్థం అహ్మదాబాద్‌లో జరిగింది. పెళ్లి కూడా అహ్మదాబాద్‌లోనే జరిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు