నకిలీ వార్తలతో ప్రమాదం

నకిలీ వార్తలు సమాజంలో ఉద్రిక్తతలను సృష్టిస్తాయని, అవి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పేర్కొన్నారు.

Published : 23 Mar 2023 03:33 IST

బాధ్యతాయుత జర్నలిజమే ప్రజాస్వామ్యానికి ఇంజిన్‌
సీజేఐ జస్టిస్‌  డి.వై.చంద్రచూడ్‌ వ్యాఖ్యలు

దిల్లీ: నకిలీ వార్తలు సమాజంలో ఉద్రిక్తతలను సృష్టిస్తాయని, అవి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన జర్నలిజం అనేది ప్రజాస్వామ్యానికి ఇంజిన్‌లా పనిచేసి మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తుందని అభిప్రాయపడ్డారు. బుధవారమిక్కడ జరిగిన 16వ రామ్‌నాథ్‌ గోయెంకా అవార్డుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో కచ్చితత్వం, పక్షపాత రహితం, బాధ్యత, ధైర్యంతో జర్నలిస్టులు విధులు నిర్వహించడం ముఖ్యమన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ మౌన నిరసనకు సూచికగా ఖాళీ పేజీలను అందించడంద్వారా మౌనం ఎంత శక్తిమంతమైందో తెలియజెప్పిందని వివరించారు. భయకంపిత రోజుల్లో భయం లేకుండా వార్తలను అందించడం ఎలాగో అప్పటి పరిస్థితులు నేర్పాయని తెలిపారు. నిజాలు మాట్లాడకుండా మీడియాను నియంత్రిస్తే ప్రజాస్వామ్య గొప్పదనం మసకబారుతుందని అభిప్రాయపడ్డారు. జర్నలిజం ఒక వ్యవస్థలా ఎదిగేందుకు నిర్మాణాత్మక ప్రజాస్వామ్యం సహకారం అందజేయాలని సూచించారు. ‘హాలీవుడ్‌ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై ప్రారంభమైన మీ టూ ఉద్యమం మీడియా కథనాల ద్వారానే అతి పెద్ద ఉద్యమంగా మారింది. అత్యాచారాలపైనా మీడియా కథనాలే ప్రజల్లో చైతన్యానికి కారణమయ్యాయి. దేశంలో ప్రజాస్వామ్యం నిలవాలంటే మీడియాకు స్వేచ్ఛ ఉండాలి. వార్తా పత్రికలు ఎన్నో సామాజిక, రాజకీయ మార్పులకు కారణమయ్యాయి’అని సీజేఐ పేర్కొన్నారు. ఒక్కోసారి మీడియా అత్యుత్సాహం నేర నిర్ధారణ కాకముందే కొంత మంది వ్యక్తులను దోషులుగా ప్రజల ముందు నిలబెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులు వారిని దోషులుగా తేల్చకముందే జరిగే ఇటువంటి చర్యలు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వివరించారు.  2019,2020కి సంబంధించి 43 మంది  జర్నలిస్టులకు ఆయన అవార్డులను అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని