National News: పురపాలక పదవి కోసం.. 45 ఏళ్ల వయసులో పెళ్లి!

స్థానిక సంస్థల ఎన్నికలను నాయకులు వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకోవడం గ్రామ రాజకీయాల్లో చూస్తుంటాం.

Updated : 15 Apr 2023 08:51 IST

స్థానిక సంస్థల ఎన్నికలను నాయకులు వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకోవడం గ్రామ రాజకీయాల్లో చూస్తుంటాం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌కు చెందిన ఓ నాయకుడు.. ఎన్నికల కోసం 45 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడీ వివాహం ఆయన రాజకీయ భవిష్యత్తుకు అంత అవసరమైంది మరి. రాంపుర్‌ పురపాలక ఎన్నికల నామినేషనుకు ఏప్రిల్‌ 17 తుది గడువు. స్థానిక కాంగ్రెస్‌ నాయకుడైన మామూన్‌ షా ఖాన్‌(45) అధ్యక్ష పదవికి పోటీ చేద్దామనుకున్నారు. ఇందుకోసం కొన్ని నెలల ముందు నుంచే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా.. మున్సిపాలిటీ అధ్యక్ష పదవిని మహిళలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అవాక్కయిన మామూన్‌ఖాన్‌కు అనుచరులు ఇచ్చిన సలహాయే ‘‘పెళ్లి’’. ఆగమేఘాలపై మనువాడి భార్యను అధ్యక్ష పదవికి పోటీలో దించమని వారు కోరారు. మామూన్‌కు ఈ సలహా నచ్చడంతో రెండు రోజుల్లో  వధువును వెదికి, పెళ్లి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఏప్రిల్‌ 15న జరగనున్న మామూన్‌ పెళ్లి కార్డు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థి దశ నుంచీ రాజకీయాల్లో ఉండటంతో సామాజికసేవ పనుల్లో పడి ఇన్నాళ్లూ పెళ్లికి సమయం దొరకలేదని మమూన్‌ఖాన్‌ ‘ఈటీవీ భారత్‌’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని