Gurpatwant Singh Pannu: జెండాకో ఐఫోన్‌ ఎర.. చైనాకు మద్దతు ప్రకటన!

గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ.. కొద్దిరోజులుగా విదేశాల్లోని భారతీయ ఎంబసీల్లో పదేపదే వినిపిస్తున్న పేరు. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లలో భారత్‌కు తలనొప్పిగా మారిన పేరు!

Updated : 07 Jul 2023 07:31 IST

ఖలిస్థాన్‌ ఉగ్రవాది పన్నూ వ్యూహాలు
భారత ఎంబసీలపై దాడులు

గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ.. కొద్దిరోజులుగా విదేశాల్లోని భారతీయ ఎంబసీల్లో పదేపదే వినిపిస్తున్న పేరు. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లలో భారత్‌కు తలనొప్పిగా మారిన పేరు! కెనడా ప్రభుత్వానికి భారత్‌ హెచ్చరిక జారీ చేసే పరిస్థితి తలెత్తటానికి కారణమైన పేరు! అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో చనిపోయాడంటూ తొలుత.. బతికే ఉన్నాడంటూ తర్వాత.. వార్తలు రావటంతో పన్నూ పేరు తాజాగా మరోమారు తెరపైకి వచ్చింది. ఇంతకూ ఎవరీ పన్నూ? ఏంటీ కథ?

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లా ఖాంకోట్‌ గ్రామం.. గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ స్వస్థలం! ఆయన తండ్రి మహేందర్‌సింగ్‌ పంజాబ్‌ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. వీరి కుటుంబం దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌ నుంచి ఇక్కడికి వచ్చింది. పన్నూ గురించి గ్రామంలో పెద్దగా తెలియకున్నా.. వీరిది సంపన్న కుటుంబం. వ్యవసాయ భూములు, పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. ముగ్గురు సంతానంలో ఒకరైన పన్నూ పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ సంపాదించి తర్వాత అమెరికా వెళ్లాడు. ఆ దేశ పౌరసత్వం తీసుకొని అమెరికా, కెనడాల్లో న్యాయవృత్తిలో అడుగుపెట్టాడు.

ఎస్‌ఎఫ్‌జే పేరిట..

2007లో అమెరికా వేదికగా సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) పేరుతో ఓ సంస్థను ఇతరులతో కలిసి పన్నూ స్థాపించాడు. మానవ హక్కుల కోసం ఏర్పాటుచేసిన సంస్థగా దాన్ని చెబుతూనే.. భారత్‌లోని పంజాబ్‌ను సిక్కుల స్వయంప్రతిపత్తి ప్రాంతంగా (ఖలిస్థాన్‌) ఏర్పాటుచేయటం తమ ఉద్దేశంగా పేర్కొన్నాడు. అప్పటి నుంచి విదేశాల్లో భారత వ్యతిరేక ప్రదర్శనలు, ర్యాలీలు, నినాదాలు, సభలు, సమావేశాలకు కేంద్ర బిందువవుతూ వస్తున్నాడు. కెనడా, అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాల్లో భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. సోషల్‌ మీడియా వేదికగా వివాదాస్పద, రెచ్చగొట్టే పోస్టులు పెడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీలాంటి ప్రముఖ భవనాలపై తరచూ ఖలిస్థాన్‌ జెండా ఎగురవేస్తూ ఎస్‌ఎఫ్‌జే అందరి దృష్టిలో పడే ప్రయత్నం చేస్తుంటుంది. ఖలిస్థాన్‌ జెండా ఎగురవేసేవారికి ఐ-ఫోన్లు, ఇతరత్రా బహుమతులిస్తామని ప్రకటించటం ద్వారా పన్నూ యువతరాన్ని ఆకర్షిస్తుంటాడు. న్యాయపరంగా ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో.. 2014లో నరేంద్ర మోదీ, మన్మోహన్‌సింగ్‌, సోనియాగాంధీ, సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌లపై అమెరికా, కెనడాల్లో కేసులు కూడా దాఖలు చేశాడు. ఈ కేసుల కారణంగానే అమరీందర్‌సింగ్‌ 2016లో అమెరికా యాత్రను కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

చైనా అధ్యక్షుడికి సందేశం

గల్వాన్‌ సరిహద్దుల్లో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణ తర్వాత పన్నూ చర్య సిక్కు మతస్థుల్లోనూ చాలామందిలో ఆగ్రహం కల్గించింది. ‘‘చైనా పట్ల సహానుభూతి ప్రకటిస్తున్నా. గల్వాన్‌లో చైనా సైనికుల పట్ల భారత దళాలు జరిపిన క్రూరమైన దాడిని ఖండిస్తున్నాం’’ అంటూ చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు పన్నూ సందేశం పంపించాడు.

కెనడాకు భారత్‌ నిరసన

ఈ మధ్యకాలంలో ఎస్‌ఎఫ్‌జే కీలక నేతలు ముగ్గురు అనూహ్య పరిస్థితుల్లో అమెరికా, కెనడాల్లో మరణించటంతో ఆ సంస్థ ఆగ్రహంతో ఉడుకుతోంది. ఫలితంగా... ఆ రెండు దేశాల్లో భారత కాన్సులేట్లపై దాడులు, హెచ్చరికలు తీవ్రమయ్యాయి. కొద్దిరోజుల కిందటే శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌కు ఎస్‌ఎఫ్‌జే మద్దతుదారులు నిప్పుపెట్టారు. కెనడాలో భారత ఎంబసీ సిబ్బందిని పదేపదే భయపెడుతున్నారు. జులై 8న కెనడాలో భారత త్రివర్ణ పతాకాన్ని కాల్చటానికి పిలుపునిచ్చారు. తాజాగా.. వచ్చే నెల 15న భారత రాయబార కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటామంటూ ఎస్‌ఎఫ్‌జే హెచ్చరించింది. తమ దేశంలో సిక్కులు భారీ సంఖ్యలో ఉండటంతో ఓటుబ్యాంకు రాజకీయాలపై దృష్టిపెట్టిన కెనడా ప్రభుత్వం ఖలిస్థానీవాదుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. వీటిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం కెనడా ప్రభుత్వానికి హెచ్చరికలాంటి నిరసన తెలియజేసింది.

ఎస్‌ఎఫ్‌జే నిర్వాకాలు కొన్ని...

  • కొద్దిరోజుల కిందట.. మొహాలీలోని పోలీసు ఇంటెలిజెన్స్‌ ప్రధాన కార్యాలయంపై గ్రెనేడ్‌ దాడి
  • జలంధర్‌లోని బియాంత్‌సింగ్‌ విగ్రహంపై ఖలిస్థాన్‌ అనుకూల నినాదాలు
  • భారత్‌కు రప్పించకుండా ఉండేలా విదేశాల్లోని పలువురు ఖలిస్థాన్‌ ఉగ్రవాదులకు న్యాయ సాయం

అమెరికా పౌరసత్వంతో..

ఎస్‌ఎఫ్‌జే కార్యకలాపాలు హద్దులు మీరుతుండటంతో భారత ప్రభుత్వం 2019లో ఈ సంస్థను నిషేధించింది. మరుసటి ఏడాది పన్నూను ఉగ్రవాదిగా ప్రకటించింది. దీంతో రిఫరెండమ్‌-2020 పేరుతో ఖలిస్థాన్‌కు మద్దతు కూడగట్టే ప్రయత్నాలను అతడు ముమ్మరం చేశాడు. వీటికి పాకిస్థాన్‌ మద్దతిచ్చింది. 2020 అక్టోబరులో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతికి కొద్దిరోజుల ముందు ఖలిస్థాన్‌ నినాదాలు చేస్తూ, జెండాలు ఎగరేయాల్సిందిగా సిక్కు విద్యార్థులకు పిలుపునిచ్చిన పన్నూ.. అందుకు ప్రతిఫలంగా వారికి ఐఫోన్‌-12 బహుమతిగా ఇస్తానంటూ ఎర వేశాడు. ఇలా యువతరాన్ని ఖలిస్థాన్‌ వాదంవైపు ఆకర్షించేలా వారికి డబ్బులు, బహుమతులు ఇవ్వటం పన్నూ ఎత్తుగడల్లో భాగం. ఇటీవల హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ వద్ద కూడా ఖలిస్థాన్‌ పోస్టర్లు ఇలాగే వెలిశాయని సమాచారం.

 ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని