PUBG Love Story: పాక్‌ మహిళను ప్రశ్నిస్తున్న పోలీసులు

ఉత్తర్‌ప్రదేశ్‌ యువకుడితో ప్రేమలో పడి నలుగురు పిల్లలతో కలిసి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి ఇక్కడే నివాసముంటున్న పాకిస్థాన్‌ మహిళ సీమా గులాం హైదర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Updated : 18 Jul 2023 08:37 IST

దిల్లీ, లాహోర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌ యువకుడితో ప్రేమలో పడి నలుగురు పిల్లలతో కలిసి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి ఇక్కడే నివాసముంటున్న పాకిస్థాన్‌ మహిళ సీమా గులాం హైదర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆమెతోపాటు ప్రియుడు సచిన్‌ మీనా, అతడి తండ్రినీ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తీవ్రవాద నిరోధక దళం పోలీసులు విచారిస్తున్నారు. సీమాకు, భారత్‌కు చెందిన 22 ఏళ్ల సచిన్‌కు 2019లో పబ్జీ ఆడుతుండగా పరిచయమైంది. ఆ తర్వాత వారు ప్రేమలో పడ్డారు. దీంతో ఏడేళ్లలోపున్న తన నలుగురు పిల్లలను తీసుకుని దుబాయ్‌ మీదుగా నేపాల్‌.. అక్కడి నుంచి భారత్‌లోకి సీమా వచ్చింది. అప్పటి నుంచి వారిద్దరూ గ్రేటర్‌ నొయిడాలోని ఒక అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. సచిన్‌ కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అయితే ఈ నెల 4వ తేదీన పోలీసులకు సమాచారం అందడంతో సచిన్‌, సీమాలను అరెస్టు చేశారు. ఇటీవల వారిద్దరికీ బెయిలు లభించింది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.

నేను ఇప్పుడు హిందువునే: సీమా

తన భర్త హిందువని, తానూ ఇప్పుడు హిందువునేనని సీమా తెలిపారు. తాను భారతీయురాలిగానే భావిస్తున్నానని చెప్పారు.

‘నా భార్యను పంపండి’

తన భార్య సీమా హైదర్‌ను తిరిగి పాకిస్థాన్‌కు పంపించాలని, ఆమెను ఇప్పటికీ ప్రేమిస్తున్నానని భర్త గులాం హైదర్‌ పేర్కొన్నాడు. తిరిగి రావాలని తన భార్యకు సౌదీ అరేబియాలో ఉంటున్న అతడు విజ్ఞప్తి చేశాడు.

పాక్‌లో హిందువుల కిడ్నాప్‌!

పాకిస్థాన్‌లోని కశ్మోర్‌, ఘోట్కి ప్రాంతాల్లో 30 మంది హిందువులు కిడ్నాప్‌నకు గురయ్యారని పాక్‌ మానవ హక్కుల కమిషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో మహిళలు, పిల్లలు ఉన్నారని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని