వదంతులు.. అసత్యవార్తల ఆజ్యం

మణిపుర్‌లో అల్లర్లు జరిగి 160 మంది చనిపోవడానికి అధిక శాతం వదంతులు, అసత్య వార్తలే (ఫేక్‌ న్యూసే)కారణమని అధికారులు అంటున్నారు.

Published : 24 Jul 2023 04:08 IST

మణిపుర్‌ అల్లర్లపై  ప్రభుత్వం వెల్లడి

ఇంఫాల్‌: మణిపుర్‌లో అల్లర్లు జరిగి 160 మంది చనిపోవడానికి అధిక శాతం వదంతులు, అసత్య వార్తలే (ఫేక్‌ న్యూసే)కారణమని అధికారులు అంటున్నారు. వివిధ భద్రతా బలగాల అంచనాల ఆధారంగా ఈ విషయం వెల్లడైందని చెబుతున్నారు. ‘చురాచాంద్‌పుర్‌లో గిరిజనులు ఒకరిని చంపి పాలిథీన్‌ కవరులో చుట్టి పడేశారంటూ ఓ చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. దీంతో ప్రత్యర్థులు మే 4వ తేదీన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన చోటుచేసుకుంది. వాస్తవానికి అది ఫేక్‌ చిత్రం. అది దేశ రాజధాని దిల్లీలో జరిగిన సంఘటనకు సంబంధించినది. ఒక ఫేక్‌ చిత్రం అమానవీయ ఘటనకు కారణమైంది’ అని అధికారులు పేర్కొన్నారు. అదే రోజు మరో ఇద్దరు మహిళలు అత్యాచారానికి గురయ్యారని, హత్యకు గురయ్యారని వివరించారు. ఇలాంటి ఫేక్‌ ప్రచారాలను అడ్డుకోవడానికే మణిపుర్‌లో ప్రభుత్వం ఇంటర్నెట్‌ను నిలిపేసిందని తెలిపారు. ‘చందేల్‌ జిల్లాలోని ఖ్వాతా గ్రామంలో మెజారిటీ వర్గంపై గిరిజనులు ఆయుధాలతో వచ్చి దాడికి ప్రయత్నించబోతున్నారని ఒక ప్రముఖ దిన పత్రిక వార్తను ప్రచురించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. చివరకు అది ఫేక్‌ న్యూస్‌ అని తేలింది’ అని అధికారులు వివరించారు. దీంతో నిర్ధారణ చేసుకోకుండా ఎటువంటి రెచ్చగొట్టే వార్తలను ప్రచరించకూడదని స్థానిక మీడియాకు పోలీసులు సూచనలు చేశారని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైన కొన్ని ఫేక్‌ న్యూస్‌ ఉదాహరణలను అధికారులు వెల్లడించారు.

చురాచాంద్‌పుర్‌లో గిరిజన యువకులు ఆయుధాలతో కవాతు చేశారని, మహిళలు, పిల్లలను ఎత్తుకెళ్లారని ఒక వీడియో ప్రచారంలోకి వచ్చింది. అది మిజో భాషలో ఉంటే కొన్ని అసాంఘిక శక్తులు అందులో సబ్‌ టైటిల్స్‌తో ప్రచారంలోకి తెచ్చారు. ఘర్షణలకు కారణమయ్యారు. వాస్తవానికి అది ప్రత్యేక పాలనా వ్యవస్థ డిమాండులో జరిపిన ర్యాలీ.

కొంబా మారులో కొందరు గిరిజనులు ప్రార్థనా స్థలాన్ని కూల్చివేశారని ఫేక్‌ న్యూస్‌ను ప్రచారంలోకి తెచ్చారు. దీంతో భద్రతా సిబ్బంది మెజారిటీ వర్గాన్ని తీసుకెళ్లి ప్రార్థనా స్థలానికి ఎటువంటి నష్టం జరగలేదని చూపించాల్సి వచ్చింది. ఈలోగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగి ఇద్దరు గిరిజనులు గాయపడ్డారు.

మెజారిటీ వర్గానికి చెందిన మృత దేహాలు పడి ఉండగా గిరిజనులు తొక్కుతున్నట్లుగా మరో వీడియో ప్రచారంలోకి వచ్చింది. వాస్తవానికి అది గిరిజన గ్రామాన్ని తగులబెట్టేందుకు వెళ్లిన సందర్భంగా జరిగిన ఘర్షణల్లో మృతి చెందిన మెజారిటీ వర్గీయులది.

మొదట్లో గిరిజన మహిళపై దాడి చేసి కాల్చి చంపారని ఓ వీడియో ప్రచారంలోకి వచ్చింది. అయితే అది మయన్మార్‌లో జరిగిన ఘటనకు సంబంధించింది.

తమ వర్గానికి చెందిన మహిళను గిరిజనులు హింసించారని ఆరోపిస్తూ మెజారిటీ వర్గ మహిళలు దిల్లీలో ఆందోళన నిర్వహించారు. ఆ సందర్భంగా వారు చూపించిన చిత్రం వాస్తవానికి అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందినది. అదీ గృహ హింసకు సంబంధించింది.


పౌర సంఘాలపై దేశద్రోహం కేసు

ణిపుర్‌ సమగ్రత పరిరక్షణ సమన్వయ కమిటీ అధ్యక్షుడు జితేంద్ర నింగోంబాపై దేశద్రోహం, పరువు నష్టం కేసులు దాఖలయ్యాయి. ఈ నెల 10వ తేదీన ఆయనపై అస్సాం రైఫిల్స్‌ ఈ కేసు నమోదు చేసినట్లు అధికార వర్గాలు ఆదివారం వెల్లడించాయి. చురాచాంద్‌పుర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. వివిధ వర్గాల మధ్య మతం, జాతి, ప్రాంతం, పుట్టుక, ఆవాసం, భాష ఆధారంగా కొకొమి చిచ్చు పెడుతోందని ఎఫ్‌ఐఆర్‌లో అస్సాం రైఫిల్స్‌ పేర్కొంది.

రాజస్థాన్‌తో పోలుస్తారా?: చిదంబరం

దిల్లీ: మణిపుర్‌ ఘటనను రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌లతో పోల్చడం దారుణమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. కేంద్రం స్వయం ప్రేరిత కోమాలో పడిపోయిందని, ఫలితంగా ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ కుప్పకూలుతోందని పేర్కొన్నారు. ‘రాజస్థాన్‌, బిహార్‌, పశ్చిమ బెంగాల్లో మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయని అనుకుందాం.. వాటితో మణిపుర్‌లో జరుగుతున్న దారుణ హింసను పోల్చి ప్రతిపక్షాలు మౌనంగా ఉండాలా’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని