కార్మికుల మనోధైర్యానికి జాతి వందనం

ఉత్తరాఖండ్‌లోని సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకొని దాదాపు 17 రోజుల తర్వాత మంగళవారం సాయంత్రం విజయవంతంగా బయటపడిన 41 మంది కార్మికుల మనోధైర్యానికి జాతి వందనాలు సమర్పిస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు.

Updated : 29 Nov 2023 09:19 IST

రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు

దిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకొని దాదాపు 17 రోజుల తర్వాత మంగళవారం సాయంత్రం విజయవంతంగా బయటపడిన 41 మంది కార్మికుల మనోధైర్యానికి జాతి వందనాలు సమర్పిస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. ‘‘చరిత్రలో అత్యంత కష్టతరమైన ఈ సాహస ప్రయత్నంలో ఎంతో తెగువ, నిబద్ధత చూపిన నిపుణులు, సహాయక సిబ్బందికి అభినందనలు’’ అని ‘ఎక్స్‌’ ద్వారా ఆమె పోస్ట్‌ చేశారు. ‘‘ఈ మిషన్‌లో భాగస్వాములైన ప్రతిఒక్కరూ అద్భుతమైన బృంద స్ఫూర్తికి, మానవతకు నిదర్శనంగా నిలిచారు. వారికి సెల్యూట్‌ చేస్తున్నా. సిబ్బంది చూపిన ధైర్యం, సంకల్పం కార్మికులకు కొత్త జీవితాలను ప్రసాదించింది’’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ ద్వారా స్పందించారు. కార్మికుల కుటుంబాలు చూపిన సహనం, ధైర్యం గురించి ఎంత చెప్పినా తక్కువేనంటూ ప్రధాని అభినందనలు తెలిపారు.

  • జాతికి ఇది గొప్ప శుభవార్త. కార్మికుల జీవితాలను కాపాడటంలో అవిశ్రాంతంగా శ్రమించిన అందరికీ కృతజ్ఞతలు. - అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి
  • వివిధ ఏజెన్సీలు చక్కటి సమన్వయంతో పనిచేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయత్నంలో ఎన్నో సవాళ్లను వారు ఎదుర్కొన్నారు. - గడ్కరీ, కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి
  • కార్మికులను సొరంగం నుంచి సురక్షితంగా బయటకు తీసుకురావడం గొప్ప ఉపశమనం. బాధిత కార్మికులకు తగిన వైద్యచికిత్స, ఆర్థికసాయం అందించాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సొరంగ పనులు జరుగుతున్న అన్నిచోట్లా రక్షణ తనిఖీలు జరపాలి. - మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు
  • ఈ ప్రయత్నంలో అడుగడుగునా అండగా నిలిచి, మద్దతు పలికిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. కార్మికులు అందరూ క్షేమమే. తగిన వైద్యపరీక్షల తర్వాతే ఇళ్లకు పంపుతాం. ప్రతి కార్మికుడికి రూ.లక్ష సాయం అందజేస్తాం. - పుష్కర్‌సింగ్‌ ధామీ, ఉత్తరాఖండ్‌ సీఎం
  • కార్మికుల జీవితాలను కాపాడటంలో అమూల్యమైన సేవలందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. - యోగి ఆదిత్యనాథ్‌, యూపీ సీఎం
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని