16వ ఆర్థిక సంఘానికి శ్రీకారం

కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించిన విధి విధానాలకు ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం రాత్రి జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది.

Published : 30 Nov 2023 04:53 IST

విధివిధానాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర

 ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించిన విధి విధానాలకు ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం రాత్రి జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది. త్వరలో ఛైర్మన్‌, సభ్యులను నియమించనుంది. 2025 అక్టోబరు 31 నాటికి ఈ కొత్త సంఘం నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సిఫార్సులు 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి. కేంద్ర సంఘటిత నిధికి చేరే పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయడానికి వీలుగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 280(1) ప్రకారం ఆర్థిక సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కేంద్రం అందించే గ్రాంట్ల పంపిణీ, రాష్ట్రాల ఆర్థిక వనరులను అంచనా వేసి ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీ వ్యవస్థలకు అదనపు నిధులను సమకూర్చడానికి తీసుకోవాల్సిన చర్యలను ఈ ఆర్థిక సంఘం సూచిస్తుంది. 2017 నవంబరు 27న ఏర్పాటైన 15వ ఆర్థిక సంఘం 2020 ఏప్రిల్‌ 1 నుంచి ఆరేళ్ల కాలానికి సిఫార్సులు చేసింది. అవి 2026 మార్చి 31 వరకూ అమల్లో ఉంటాయి. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి. దేశవ్యాప్తంగా పర్యటించి, రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని నివేదిక అందించడానికి  రెండేళ్ల సమయం పడుతుందన్న కారణంతో కేంద్రం 16వ ఆర్థిక సంఘాన్ని ఇప్పుడే ఏర్పాటు చేస్తోంది. ఈ ఆర్థిక సంఘానికి సంబంధించిన ప్రాథమిక పనులను చూడటానికి ప్రత్యేక సెల్‌ను కేంద్ర ఆర్థికశాఖలో 2022 నవంబరు 21నే ఏర్పాటు చేశారు. విధి విధానాల ఖరారు కోసం కేంద్ర ఆర్థికశాఖ వ్యయ, ఆర్థిక, రెవెన్యూ, ఫైనాన్షియల్‌ సర్వీసుల కార్యదర్శులు, ముఖ్య ఆర్థిక సలహాదారు, నీతి ఆయోగ్‌ అదనపు కార్యదర్శుల నేతృత్వంలో ఒక వర్కింగ్‌ గ్రూప్‌ను నియమించారు. ఆ గ్రూప్‌ ప్రస్తుతానికి మూడు విధి విధానాలను ఖరారుచేసింది.

 1. రాజ్యాంగంలోని చాప్టర్‌ 1, పార్టు-12 కింద కేంద్రానికి వచ్చే నికర పన్నులను కేంద్ర, రాష్ట్రాల మధ్య పంపిణీ చేసి.. ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు కేటాయించడం.

2. భారత సంఘటిత నిధి నుంచి రాష్ట్రాలకు గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ పంపిణీ చేయడానికి ఏ సూత్రాన్ని అనుసరించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 275 కింద రాష్ట్రాలకు ఆ గ్రాంట్లను ఎలా చెల్లించాలి.

3. రాష్ట్ర ఆర్థిక సంఘాల సిఫార్సుల ఆధారంగా పంచాయతీలు, మున్సిపాలిటీలకు అదనపు నిధులు సమకూర్చేందుకు వీలుగా రాష్ట్ర సంఘటిత నిధి బలోపేతానికి అవసరమైన చర్యలు.

కేంద్రం 16వ ఆర్థిక సంఘానికి పైన పేర్కొన్న మూడింటితోపాటు మరో 8 విధి విధానాలను నిర్దేశించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం గత ఆర్థిక సంఘం సిఫార్సులు చేసింది. ఇప్పుడు 2021 జనగణన జరగలేదు కాబట్టి ఇప్పుడూ అదే జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని