పార్లమెంటు అలజడి తీవ్రమైన అంశం

పార్లమెంటులో భద్రతా వైఫల్యాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని, దీనిపై కలహించుకోవడం తగదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Updated : 18 Dec 2023 06:00 IST

దీనిపై కలహించుకోవడం తగదు
ప్రధాని మోదీ వ్యాఖ్యలు

దిల్లీ: పార్లమెంటులో భద్రతా వైఫల్యాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని, దీనిపై కలహించుకోవడం తగదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని, కఠిన చర్యలకు ఉపక్రమించాయని చెప్పారు. ఈ అంశంపై చర్చించాల్సిందేనని ఉభయ సభల్లో ప్రతిపక్షాలు డిమాండు చేస్తున్న నేపథ్యంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడం ఎంతో బాధించింది. దీన్ని తక్కువగా అంచనా వేయకూడదు. ఇలాంటివి పునరావృతం కాకుండా మూలాల్లోకి వెళ్లి పరిష్కారం కనుగొనాలి. ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేయడం మానుకోవాలి. ఘటన అనంతరం స్పీకర్‌ ఓం బిర్లా విచారణకు ఆదేశించారు. దర్యాప్తుపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ కుట్ర వెనుక నిజాలు త్వరలోనే బయటపడతాయి’ అని ప్రధాని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలుగా కొత్త వారిని ఎంపిక చేయడంపై ప్రధాని మాట్లాడుతూ.. ‘మూడు రాష్ట్రాల సీఎంలు కొత్తవారని చాలా మంది భావిస్తున్నారు. నిజానికి వారు కొత్తవాళ్లేం కాదు.. ఎంతో అనుభవం ఉంది. చాలా కాలంగా మీడియా దృష్టి కొన్ని కుటుంబాలపైనే ఉండిపోయింది. దీంతో కష్టపడి పని చేసేవారి గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదు. ఇలాంటివి ప్రతి రంగంలోనూ ఉంటాయి’ అని స్పష్టం చేశారు. ఆర్టికల్‌ 370 రద్దుకు సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసిందని, ప్రపంచంలో ఏ శక్తీ దానిని తిరిగి తీసుకురాలేదని తెలిపారు. 2024 ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధిస్తామని చెప్పారు. తమను ప్రజలు ఎందుకు తిరస్కరిస్తున్నారో ప్రతిపక్షాలు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.

చర్చ నుంచి ప్రధాని పారిపోతున్నారు: కాంగ్రెస్‌

పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై చర్చ నుంచి ప్రధాని మోదీ పారిపోతున్నారని కాంగ్రెస్‌ విమర్శించింది. ఇందులో మైసూరు ఎంపీ పాత్రపై ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తోందనే ఇలా చేస్తున్నారని అభిప్రాయపడింది. పార్లమెంటు ఘటనపై కలహించుకోవడం తగదని ప్రధాని హితవు పలికిన నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ స్పందించారు. ఎట్టకేలకు ఈ అంశంపై ప్రధాని మాట్లాడారని పేర్కొన్నారు.


వికసిత్‌ భారత్‌ నాకో పరీక్ష: ప్రధాని

వారణాసి: పక్కా ఇల్లు, గ్యాస్‌ సిలిండర్‌ అందినప్పుడే పేదలు సాధికారత సాధించగలుగుతారని, ఆత్మ విశ్వాసంతో ఉంటారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తాను గ్యాస్‌ సిలిండర్‌ను పొందానని చెప్పిన రోజున అతడు పేద, గొప్ప తారతమ్యాలు అంతమైనట్లు భావిస్తాడని తెలిపారు. సంక్షేమ ఫలాలు అందుతున్నాయో లేదో ప్రజల నుంచి ప్రత్యక్షంగా తెలుసుకునే వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర తనకో పెద్ద పరీక్షని చెప్పారు. వారణాసిలో జరిగిన వికసిత్‌ సంకల్ప్‌ యాత్రలో ప్రధాని మాట్లాడారు. ‘నేను ఏం చెప్పానో.. ఏం చేస్తున్నానో ప్రజల నుంచి నేరుగా తెలుసుకోవాలనుకుంటున్నా. దేశం సరైన దారిలో వెళ్తుందా లేదా అనేదీ ప్రజల నుంచి వినాలనుకుంటున్నా. నేను అనుకున్న వారికి ఫలాలు అందుతున్నాయా అని తెలుసుకోవాలనుకుంటున్నా. నేను చేసిన పని ఫలితాలిస్తోందా లేదా అనేదీ తెలుసుకోవడానికే ఈ ప్రయత్నం’ అని మోదీ పేర్కొన్నారు.

రెండో కాశీ తమిళ సంగమం ప్రారంభం

వారణాసిలోని నమో ఘాట్‌లో ఆదివారం ప్రధాని మోదీ.. రెండో కాశీ తమిళ సంగమాన్ని ప్రారంభించారు. వారణాసి, కన్యాకుమారిల మధ్య తిరిగే కాశీ తమిళ సంగమం ఎక్స్‌ప్రెస్‌ రైలుకూ ఆయన శ్రీకారం చుట్టారు. ఆదివారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ జరిగే కాశీ తమిళ సంగమంలో తమిళనాడు, పుదుచ్చేరిల నుంచి 1,400 మంది పాల్గొంటారు. కృత్రిమ మేధ టూల్‌ ‘భాషిణి’ని ఉపయోగించి ప్రధాని మోదీ హిందీ ప్రసంగాన్ని తమిళంలోకి అనువదించారు. ప్రధాని కార్యక్రమంలో తొలిసారిగా దీనిని వినియోగించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు