గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లో కొత్త విద్యుత్తు కనెక్షన్‌

విద్యుత్తు కనెక్షన్ల జారీని కేంద్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. మెట్రో నగరాల్లో 3 రోజుల్లోగా, మున్సిపాలిటీ పరిధిలో 7 రోజుల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లోగా కొత్త కనెక్షన్లను మంజూరు చేయాలని కేంద్ర విద్యుత్తుశాఖ స్పష్టం చేసింది.

Published : 23 Feb 2024 05:59 IST

మెట్రో నగరాల్లో 3 రోజుల్లో.. మున్సిపాలిటీల్లో 7 రోజుల్లో ఇవ్వాలి
వినియోగదారుల హక్కుల నిబంధనలకు సవరణ

ఈనాడు, దిల్లీ: విద్యుత్తు కనెక్షన్ల జారీని కేంద్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. మెట్రో నగరాల్లో 3 రోజుల్లోగా, మున్సిపాలిటీ పరిధిలో 7 రోజుల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లోగా కొత్త కనెక్షన్లను మంజూరు చేయాలని కేంద్ర విద్యుత్తుశాఖ స్పష్టం చేసింది. కొండ ప్రాంతాలకైతే దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా కొత్త కనెక్షన్‌ పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఇలాంటి చోట్లకు విద్యుత్తు సరఫరా చేయడానికి పంపిణీ వ్యవస్థలను విస్తరించాల్సి ఉన్నా, కొత్త సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాల్సి వచ్చినా 90 రోజుల్లోగా ఆ పనులన్నీ పూర్తి చేయాలని పేర్కొంది. ఈ మేరకు విద్యుత్తు వినియోగదారుల హక్కుల నిబంధనలను సవరిస్తూ గురువారం కేంద్రం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

  • గృహ సముదాయాలు, రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ లాంటి సంఘాలకు సింగిల్‌ పాయింట్‌ కనెక్షన్‌గానీ, ఒక్కో ఇంటికి వేర్వేరుగాగానీ కనెక్షన్లు ఇవ్వాలని తెలిపింది. అయితే ఆ అసోసియేషన్‌లోని మెజారిటీ ఫ్లాట్ల యజమానుల కోరికను అనుసరించి ఈ పని చేయాలని పేర్కొంది. దీనిని డిస్కంలు పారదర్శకమైన బ్యాలెట్‌ పద్ధతిలో నిర్ధారించుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ బ్యాలెట్‌లో 50% మందికిపైగా యజమానులు వ్యక్తిగత కనెక్షన్లు కావాలని కోరితే ప్రతి యజమానికీ వేర్వేరు కనెక్షన్లు ఇవ్వాలని నిర్దేశించింది.  
  • సింగిల్‌ పాయింట్‌ కనెక్షన్‌ ఉన్నప్పుడు ప్రీపేమెంట్‌ మీటర్లు పెట్టి అసోసియేషన్లు వసూలు చేసే బిల్లులు లాభనష్టాల్లేని విధానం ప్రకారం ఉండాలని పేర్కొంది.
  • ఓనర్ల కోరిక మేరకు విద్యుత్తు వాహనాల ఛార్జింగ్‌ కోసం డిస్కంలు ప్రత్యేక కనెక్షన్‌ ఇవ్వాలని నిర్దేశించింది.
  • విద్యుత్తు మీటర్లు సరిగా పని చేయడం లేదని, ఆగి పోయిందని, సీల్‌ డ్యామేజ్‌ అయిందని, కాలిపోయిందని, దెబ్బతిందని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందిన 30 రోజుల్లోగా డిస్కంలు వాటిని పరీక్షించాలని కేంద్ర విద్యుత్తుశాఖ నిర్దేశించింది.
  • రూఫ్‌టాప్‌ సోలార్‌ సిస్టమ్‌ ఏర్పాటుకు సాంకేతిక సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని 15 రోజుల్లోగా పూర్తి చేయాలని సూచించింది. ఆలోగా చేయకపోతే ఆ ప్రాజెక్టు సాధ్యమేనని భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని