రూ.39,125 కోట్ల ఆయుధ ఒప్పందాలపై సంతకాలు

సైనిక దళాల పోరాట పటిమకు మరింత పదును పెడుతూ ఐదు భారీ ఆయుధ కొనుగోలు కాంట్రాక్టులపై భారత్‌ శుక్రవారం సంతకాలు చేసింది. వీటి విలువ రూ.39,125 కోట్లు.

Published : 02 Mar 2024 04:27 IST

దిల్లీ: సైనిక దళాల పోరాట పటిమకు మరింత పదును పెడుతూ ఐదు భారీ ఆయుధ కొనుగోలు కాంట్రాక్టులపై భారత్‌ శుక్రవారం సంతకాలు చేసింది. వీటి విలువ రూ.39,125 కోట్లు. ఇందులో బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణులు, రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, మిగ్‌-29 యుద్ధవిమానాలకు అవసరమైన ఏరో ఇంజిన్లు ఉన్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆ శాఖ కార్యదర్శి గిరిధర్‌ల సమక్షంలో తాజా సంతకాల కార్యక్రమం జరిగింది. ఈ ఒప్పందాల వల్ల దేశీయ ఆయుధ సామర్థ్యం మరింత పెరుగుతుందని, విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని అధికారిక ప్రకటన పేర్కొంది.

  • బ్రహ్మోస్‌ క్షిపణుల సేకరణకు రెండు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో మొదటిదాని విలువ రూ.19,518.65 కోట్లు. దీని కింద సేకరించే క్షిపణులను భారత నౌకాదళ పోరాట, శిక్షణ అవసరాలకు ఉపయోగిస్తారు.
  • రూ.988 కోట్ల విలువైన మరో ఒప్పందం కింద సేకరించే బ్రహ్మోస్‌ క్షిపణి వ్యవస్థలను యుద్ధనౌకల్లో అమరుస్తారు. ఇవి సముద్రంతోపాటు నేలపై ఉన్న లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగలవు.
  • మిగ్‌-29 యుద్ధవిమానాల కోసం ఆర్‌డీ-33 ఏరో ఇంజిన్ల కొనుగోలు ఒప్పందంపై హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ సంస్థ సంతకం పెట్టింది. దీని విలువ రూ.5,249.72 కోట్లు. రష్యా నుంచి సాంకేతిక పరిజ్ఞాన బదిలీతో దేశంలోనే ఈ ఇంజిన్లను ఉత్పత్తి చేస్తారు.
  • రూ.7,668.82 కోట్లతో క్లోజిన్‌ వెపన్‌ సిస్టమ్‌ (సీఐడబ్ల్యూఎస్‌) కొనుగోలుకు ఎల్‌ అండ్‌ టీ సంస్థతో ఒప్పందం కుదిరింది. దేశంలో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో గగనతల రక్షణ కోసం వీటిని మోహరిస్తారు.
  • హైపవర్‌ రాడార్‌ వ్యవస్థల కొనుగోలుకు ఎల్‌ అండ్‌ టీతో రూ.5,700 కోట్ల ఒప్పందం ఖరారైంది. దీనికింద భారత వాయుసేనలో ఉపయోగిస్తున్న దీర్ఘశ్రేణి రాడార్ల స్థానంలో మరింత ఆధునికమైన ‘యాక్టివ్‌ అపర్చెర్‌ ఫేజ్డ్‌ అరే బేస్డ్‌ హైపవర్‌ రాడార్లు’  సమకూరుతాయి. గగనతలంపై మెరుగైన నిఘాకు ఇవి దోహదపడతాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని