లక్షద్వీప్‌లో భారత్‌ సరికొత్త నౌకాదళ స్థావరం

హిందూ మహాసముద్ర తీరంలో స్థావరాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్‌ అడుగులు వేస్తోంది. లక్షద్వీప్‌లోని మినికాయ్‌ ద్వీపంలో వచ్చేవారం భారత నౌకాదళం సరికొత్త స్థావరాన్ని ఏర్పాటు చేయనుంది.

Published : 02 Mar 2024 05:07 IST

వచ్చే వారంలో ప్రారంభం

దిల్లీ: హిందూ మహాసముద్ర తీరంలో స్థావరాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్‌ అడుగులు వేస్తోంది. లక్షద్వీప్‌లోని మినికాయ్‌ ద్వీపంలో వచ్చేవారం భారత నౌకాదళం సరికొత్త స్థావరాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికి ‘ఐఎన్‌ఎస్‌ జటాయు’గా పేరు పెట్టారు. మాల్దీవులకు దాదాపు 80 కి.మీ దూరంలో ఐఎన్‌ఎస్‌ జటాయు పనిచేయనుంది. శత్రువుల సైనిక, వాణిజ్య కార్యకలాపాలపై నిఘా ఉంచడానికి, ఆ ప్రాంతంలో బలమైన పట్టును సాధించడానికి ఈ స్థావరం ఎంతగానో ఉపయోగపడుతుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో తొలుత తక్కువ మంది అధికారులు, సిబ్బంది ఉంటారని, భవిష్యత్తులో దీనిని అతిపెద్ద నౌకాదళ స్థావరాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నాయి. ఇప్పటికే తూర్పున అండమాన్‌-నికోబార్‌ ద్వీపాల్లో ఉన్న ఐఎన్‌ఎస్‌ బాజ్‌ స్థావరం మాదిరిగా.. పశ్చిమాన జటాయు సేవలు అందించనుంది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య కమాండర్ల సమావేశం, గోవాలో నిర్మించిన నౌకాదళ కళాశాల ప్రారంభం, ఎంహెచ్‌-60 హెలికాప్టర్లను సైతం ఈ సందర్భంగా దళంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత నౌకాదళం లక్షద్వీప్‌ సమీపంలోని ప్రాంతంలో తొలిసారిగా జంట వాహక నౌకల కార్యకలాపాలను ప్రదర్శించబోతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని