పాక్‌కు అణు సరఫరాలను అడ్డుకున్న భారత్‌

చైనా నుంచి కరాచీకి వెళ్తున్న అణు సరఫరాలను ముంబయికి సమీపంలోని ఎన్‌హావా శేవా పోర్టువద్ద భారత భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. నౌకలోని సరకును స్వాధీనం చేసుకున్నారు.

Published : 03 Mar 2024 04:48 IST

చైనా నుంచి నౌకలో వెళ్తుండగా స్వాధీనం

ముంబయి: చైనా నుంచి కరాచీకి వెళ్తున్న అణు సరఫరాలను ముంబయికి సమీపంలోని ఎన్‌హావా శేవా పోర్టువద్ద భారత భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. నౌకలోని సరకును స్వాధీనం చేసుకున్నారు. అందులో అణు కార్యక్రమంతోపాటు బాలిస్టిక్‌ క్షిపణుల తయారీకి సంబంధించినవి ఉన్నాయని శనివారం అధికారులు వెల్లడించారు. నిఘా విభాగం ఇచ్చిన సమాచారంతో మాల్టా జెండాతో వెళ్తున్న సీఎంఏ సీజీఎం అట్టీలా నౌకను ఎన్‌హావా శేవా వద్ద జనవరి 23వ తేదీన ఆపిన కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. అందులో ఇటలీ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్‌ న్యూమరికల్‌ కంట్రోల్‌ (సీఎన్‌సీ) మెషీన్‌ వంటివి ఉన్నాయి. వాటిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అధికారులు పరిశీలించి అణు కార్యక్రమానికి వినియోగించేదిగా తేల్చారు. క్షిపణి అభివృద్ధిలోనూ దీనిని ఉపయోగించవచ్చు. వాస్సెనార్‌ ఒప్పందం ప్రకారం.. సీఎన్‌సీ మెషీన్‌ అనేది అంతర్జాతీయ ఆయుధాల సరఫరా నియంత్రణ పరిధిలోకి వస్తున్నందున స్వాధీనం చేసుకున్నామని భారత అధికారులు వెల్లడించారు. పౌర, సైనిక సేవలకు ఉపయోగించే ఈ డ్యూయెల్‌ మెషీన్లను  ఒప్పందంలోని దేశాలు స్వాధీనం చేసుకోవచ్చని వివరించారు. ఉత్తర కొరియా ఈ మెషీన్లను అణు కార్యక్రమాల్లో వినియోగిస్తోంది. షిప్పింగ్‌ వివరాల్లో అన్నీ తప్పులే ఉన్నాయని, పాకిస్థాన్‌ అక్రమ ఆయుధాల సేకరణకు ఇది రుజువని అధికారులు అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని