కేంద్ర ఎన్నికల సంఘానికి ఇద్దరు కొత్త కమిషనర్లు

పదవీ విరమణ చేసిన మాజీ ఉన్నతాధికారులు జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్బీర్‌ సింగ్‌ సంధు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఎంపికయ్యారు. ఈ ఇద్దరు మాజీ ఐఏఎస్‌ల పేర్లకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ గురువారం ఆమోదం తెలిపింది.

Updated : 15 Mar 2024 05:35 IST

మాజీ ఐఏఎస్‌లు జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్బీర్‌ సింగ్‌ సంధు ఎంపిక
ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం
అనుసరించిన విధానం సక్రమంగా లేదంటూ అసమ్మతి తెలిపిన అధీర్‌ రంజన్‌ చౌధరి

ఈనాడు, దిల్లీ: పదవీ విరమణ చేసిన మాజీ ఉన్నతాధికారులు జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్బీర్‌ సింగ్‌ సంధు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఎంపికయ్యారు. ఈ ఇద్దరు మాజీ ఐఏఎస్‌ల పేర్లకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ గురువారం ఆమోదం తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి సభ్యులుగా ఉన్న ఈ కమిటీ దీని కోసం గురువారం దిల్లీలో సమావేశమైంది. అనంతరం ఇద్దరు కొత్త కమిషనర్ల నియామకంపై కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ ఈ నెల 8న రాజీనామా చేయడం, మరో కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే కాలపరిమితి ఫిబ్రవరి 14న ముగియడంతో ఎన్నికల సంఘంలో ఏర్పడిన రెండు ఖాళీలను కేంద్ర ప్రభుత్వం వీరిద్దరితో భర్తీచేసింది.

గత డిసెంబరులో చేసిన ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం ప్రకారం ఆ పదవులకు కేంద్ర ప్రభుత్వంలో సెక్రెటరీ స్థాయి హోదాలో పని చేసిన వారు మాత్రమే అర్హులు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం పదవీ విరమణ చేసిన, ప్రస్తుతం సెక్రెటరీ హోదాల్లో పని చేస్తున్న, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుత, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల (సీఎస్‌) పేర్లు 200లకు పైగా పరిశీలించింది.  కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ నేతృత్వంలోని సెర్చ్‌ కమిటీ... వడపోత తర్వాత ఉత్పల్‌కుమార్‌ సింగ్‌, ప్రదీప్‌కుమార్‌ త్రిపాఠి, జ్ఞానేష్‌కుమార్‌, ఐ.పాండే, సుఖ్బీర్‌సింగ్‌ సంధు, సుధీర్‌కుమార్‌ గంగాధర్‌లతో జాబితా రూపొందించింది. ఈ ఆరుగురి నుంచి ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ జ్ఞానేష్‌కుమార్‌, సుఖ్బీర్‌ సింగ్‌లను ఎంపిక చేసింది. కొత్త కమిషనర్లుగా నియమితులైన ఇద్దరికీ మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎస్‌.వై.ఖురేషి సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా అభినందనలు తెలిపారు. సమర్థులైన అధికారులని కితాబునిచ్చారు.

అధీర్‌ రంజన్‌ అసంతృప్తి

కొత్త ఎన్నికల కమిషనర్ల ఎంపికపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకముందే సెలక్షన్‌ కమిటీ సభ్యుల్లో ఒకరైన కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ ఛౌధరి వారి పేర్లను బయటపెట్టారు. ఎన్నికల కమిషనర్ల నియామకం తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పదవి కోసం తుది జాబితాలో చేర్చిన ఆరుగురు అధికారుల పేర్లను తనకు ముందుగా అందించలేదన్నారు. ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘పరిశీలించిన 212 మంది అధికారుల పేర్లను తొలుత ఇచ్చారు. అయితే, సమావేశం ప్రారంభానికి కేవలం పది నిమిషాల ముందు తుది జాబితాలో చేర్చిన ఆరుగురి పేర్లను అందజేశారు. కమిషనర్ల ఎంపిక ఏకపక్షం అని నేను చెప్పడం లేదు. అయితే అందుకు అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉంది. ఎంపిక కమిటీలో సీజేఐ కూడా సభ్యులుగా ఉండాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

అధికరణం 370 రద్దులో కీలకపాత్ర...

కొత్త కమిషనర్లుగా ఎంపికైన జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్బీర్‌సింగ్‌ సంధు ఇద్దరూ 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులే. జ్ఞానేష్‌ జన్మతః ఉత్తర్‌ప్రదేశ్‌వాసి. 1964లో జన్మించారు. కేరళ కేడర్‌ ఐఏఎస్‌ అధికారిగా ఆయన సర్వీస్‌ ప్రారంభమైంది.  దిల్లీలో కేరళ రెసిడెంట్‌ కమిషనర్‌గా,  కేంద్ర హోంశాఖలో అదనపు కార్యదర్శిగా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా,  కేంద్ర సహకారశాఖ కార్యదర్శి గా పని చేశారు. ఈ ఏడాది జనవరి 31న పదవీ విరమణ చేశారు. 2019లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ అధికరణం 370ని రద్దుచేస్తూ బిల్లు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

ఉత్తరాఖండ్‌లో యూసీసీ రూపకల్పన...

జన్మతః పంజాబ్‌కు చెందిన సుఖ్బీర్‌సింగ్‌ సంధు...ఉత్తరాఖండ్‌ కేడర్‌ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. 1963లో జన్మించారు. పట్టణ సంస్కరణలు, మున్సిపాల్టీల నిర్వహణ, సామర్థ్యం పెంపు అంశాలపై పుస్తకాలు రాశారు. లూథియానా మున్సిపల్‌ కమిషనర్‌గా అందించిన సేవలకు, జనాభా లెక్కల్లో చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి పతకాలు అందుకున్నారు. నేషనల్‌ హైవే అథారిటీ ఛైర్మన్‌గా,  కేంద్ర ఉన్నత విద్యాశాఖ అదనపు కార్యదర్శిగా,  ఉత్తరాఖండ్‌ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఆ రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) చట్టాన్ని కార్యరూపంలోకి తీసుకురావడంలో విశిష్ఠ సేవలందించారు. ఫిబ్రవరి 3న లోక్‌పాల్‌ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో కొనసాగుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని