Loksabha Elections: మోగింది ‘సార్వత్రిక’ శంఖం

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓట్ల పండగకు తెరలేచింది. సార్వత్రిక ఎన్నికల శంఖారావం మోగింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన 543 లోక్‌సభ స్థానాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు, వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.

Updated : 17 Mar 2024 07:04 IST

7 దశల్లో ఎన్నికలు.. జూన్‌ 4నఫలితాలు
తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్‌.. ఏపీ అసెంబ్లీకి కూడా
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌తో పాటు 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకూ ఉపఎన్నికలు
18వ లోక్‌సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల
కులం, మతం పేర్లతో ఓట్లు అడగడం నిషిద్ధం
ఈసీ స్పష్టీకరణ.. ఎన్నికల కోడ్‌ అమల్లోకి...

ఈనాడు, దిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓట్ల పండగకు తెరలేచింది. సార్వత్రిక ఎన్నికల శంఖారావం మోగింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన 543 లోక్‌సభ స్థానాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు, వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 19న తొలివిడత పోలింగ్‌ ఉంటుంది. జూన్‌ 1న ఏడో విడత ఓటింగ్‌ జరుగుతుంది. అన్నింటికీ కలిపి జూన్‌ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శనివారం సాయంత్రం 3 గంటలకు ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధులతో కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌ ఈ వివరాలను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు; తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక మే 13న జరగనుంది. షెడ్యూల్‌ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.

అవే పెద్ద సవాల్‌

సాంకేతికతను ఉపయోగించి ఈ ఎన్నికలపై గట్టి నిఘా ఉంచనున్నట్లు రాజీవ్‌కుమార్‌ వెల్లడించారు. ఎన్నికల విధుల్లో ఏ స్థాయిలోనూ వాలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించకూడదని స్పష్టంచేశారు. ‘‘ఎన్నికల్లో కండబలం, ధనబలం, తప్పుడు సమాచారం, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన పెద్ద సవాల్‌గా మారాయి. వాటిని అడ్డుకొనేందుకు కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. ఎన్నికల్లో హింసకు తావు ఉండకూడదు. రక్తపాతం జరగకూడదని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం సీనియర్‌ అధికారి నేతృత్వంలో ప్రతి జిల్లాలో ఒక కంట్రోల్‌రూం ఏర్పాటు చేస్తున్నాం. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకొనేలా ఏర్పాట్లు చేశాం. అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి డబ్బు, ఇతర వస్తువుల అక్రమ రవాణాపై నిఘా పెడతాం’’ అని పేర్కొన్నారు.

ధనబలంపై కొరడా

గత ఏడాదిన్నర కాలంలో జరిగిన 11 అసెంబ్లీ ఎన్నికల్లో రూ.3,400 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని సీఈసీ తెలిపారు. ఆ అనుభవంతో ఈసారి డబ్బు సరఫరా కట్టడికి గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘ఇందుకోసం కట్టుదిట్టమైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలను మోహరిస్తున్నాం. ఉచితాలు, మద్యం, నగదు, కుక్కర్‌, చీరలు వంటి వాటి పంపిణీని 100% నిరోధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వీటిని అడ్డుకోవడానికి జీఎస్‌టీ, రాష్ట్ర పోలీసులు, ఆదాయపు పన్నుశాఖ, కస్టమ్స్‌, కోస్ట్‌గార్డ్‌, నార్కోటిక్స్‌ యంత్రాంగ సేవలను ఉపయోగించుకుంటాం. ఎక్కడైనా అనూహ్యంగా కొన్ని వస్తువుల కొనుగోలు పెరిగితే.. దానిపై వెంటనే దృష్టిసారించి, తగు చర్యలు చేపడతాం. ఏటీఎంలలో నగదు విత్‌డ్రాయల్స్‌ పెరగడం, బ్యాంకులు, డిజిటల్‌ వ్యాలెట్ల ద్వారా డబ్బు పంపిణీ వంటివాటిపై ఎన్‌పీసీఐఎల్‌ దృష్టిసారిస్తుంది. అనుమానాస్పద లావాదేవీలపై బ్యాంకులు, ఎన్‌పీసీఐఎల్‌ రోజువారీ నివేదికలు పంపుతాయి. విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్స్‌లో నిఘా ఉంచబోతున్నాం. హెలికాప్టర్లు, చార్టర్డ్‌ విమానాల రాకపోకలు సాగించే చోట తనిఖీలు జరుగుతాయి’’ అని వెల్లడించారు. సరిహద్దుల్లో డ్రోన్ల సాయంతోనూ తనిఖీలు ఉంటాయని తెలిపారు. 

తప్పుడు సమాచారంపై చర్యలు

తప్పుడు సమాచారం ఎన్నికల్లో ప్రధాన సమస్యగా మారిందని, ఈ పోకడలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకుంటామని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ‘‘ఇందుకోసం ప్రతి రాష్ట్రంలో అధీకృత అధికారిని నియమిస్తాం. చట్టవిరుద్ధమైన విషయాలను సామాజిక మాధ్యమాల నుంచి తొలగిస్తాం. నిజాలేవో.. అబద్ధాలేవో వెల్లడి చేసేందుకు త్వరలో ఒక వెబ్‌సైట్‌ ప్రారంభిస్తాం. నకిలీ వార్తల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఫార్వర్డ్‌ చేయొద్దు’’ అని పిలుపునిచ్చారు.

కట్టుదిట్టంగా నియమావళి

పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా పాటించాలని సీఈసీ కోరారు. ‘‘సమాజంలో విభజన తెచ్చే వ్యాఖ్యలు, విద్వేష ప్రసంగాలు, వ్యక్తిగత విమర్శలు, దుర్భాషలకు దూరంగా ఉండాలి. కులం, మతం ఆధారంగా ఓట్లను అడగకూడదు. వ్యక్తిగత అంశాలపైనా విమర్శలు చేయకూడదు’’ అని స్పష్టంచేశారు. ప్రభుత్వ నిధులతో ప్రకటనలు జారీ చేయకూడదని తెలిపారు. నియమావళి ఉల్లంఘిస్తే ఎంతటివారిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. పార్టీల ప్రకటనలను వార్తలుగా ప్రచురించడం, ప్రసారం చేయకూడదని సంపాదకులను కోరామన్నారు. లోక్‌సభ అభ్యర్థి రూ.90 లక్షలు, అసెంబ్లీకి పోటీ చేస్తున్నవారు రూ.38 లక్షల వరకు ఖర్చుపెట్టవచ్చన్నారు.

పూర్తి పర్యవేక్షణ

దేశవ్యాప్తంగా 2,100 మంది పరిశీలకులను మోహరించామని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను వీరు పర్యవేక్షించి తమకు సమాచారం అందిస్తారన్నారు. ‘‘రీపోలింగ్‌లను తగ్గించడం, హింస, ప్రలోభాలు, తప్పుడు సమాచారం, విద్వేషాలు లేకుండా చేసి ప్రజా భాగస్వామ్యాన్ని పెంచేలా ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నాం. గతంలో జరిగిన 67% ఓటింగ్‌ను ఈసారి పెంచాలన్నదే మా లక్ష్యం’’ అని తెలిపారు.

అందుకే ఏడు దశలు..

అధికారపక్షానికి అనుకూలంగా ఉండటానికే ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారన్న వాదనలను సీఈసీ ఖండించారు. ‘‘ఈ దేశ భౌగోళిక పరిస్థితులు, దాని విస్తృతిని దృష్టిలో ఉంచుకొని భద్రతా దళాల తరలింపులోని సాధకబాధకాలను అర్థం చేసుకోవాలి. కొండలు, గుట్టలు, మంచు, ఎడారి ప్రాంతాల నుంచి బలగాలను తరలించడం ఎంత కష్టమో ఆలోచించాలి. హోలీ, రంజాన్‌, శ్రీరామనవమి లాంటి పండగలు, పరీక్షలను దృష్టిలో ఉంచుకొని షెడ్యూల్‌ను నిర్ణయించాల్సి వచ్చింది’’ అని తెలిపారు. 12 రాష్ట్రాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని ఆయన చెప్పారు. 1.89 కోట్ల మంది కొత్త ఓటర్లు ఉన్నారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా.. 85 ఏళ్లు పైబడ్డ ఓటర్లు, 40 శాతానికిపైగా వైకల్యం ఉన్నవారు ఇంటి నుంచే ఓటేసే వెసులుబాటును కల్పిస్తున్నారు.

ఈవీఎంలలోకి వైరస్‌ అసాధ్యం

ఈవీఎంలపై వచ్చిన ఆరోపణలపై హైకోర్టులు, సుప్రీంకోర్టు 40సార్లు పరిశీలన జరిపి వాటిని తిరస్కరించాయని రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. ఆ యంత్రాల్లోకి వైరస్‌ను ప్రవేశపెట్టడం అసాధ్యమన్నారు. అలాగే చెల్లుబాటు కాని ఓట్లు ఉండవని, రిగ్గింగ్‌ కూడా కుదరదని తెలిపారు.  ఆ యంత్రాలు 100% సురక్షితమని పేర్కొన్నారు. 

రాజీనామా ఆయన వ్యక్తిగతం

ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన అరుణ్‌ గోయల్‌ మంచి వ్యక్తి అని సీఈసీ తెలిపారు.  ఎందుకు రాజీనామా చేశారన్నది ఆయన వ్యక్తిగత విషయమని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌లో భిన్నాభిప్రాయాలు, వ్యతిరేక అభిప్రాయాలను స్వీకరిస్తామని చెప్పారు. ఎన్నికల బాండ్ల విషయంలో పారదర్శకత ఉండాలని ఈసీ తొలి నుంచీ వాదిస్తూ వస్తోందని తెలిపారు. అందుకే రాజకీయ పార్టీల విరాళాలు, ఖర్చులను ఏటా సమర్పించాలన్న నిబంధన పెట్టినట్లు చెప్పారు.  12వ తరగతి పూర్తయిన విద్యార్థులకు ఓటరు కార్డు జారీచేసే విధానం తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. 

గతంలో..

2004లో 4, 2009లో 5, 2014లో 9, 2019లో 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. 2019 ఎన్నికల షెడ్యూల్‌ మార్చి 10న విడుదలకాగా, ఈసారి 6 రోజులు ఆలస్యంగా ఈసీ విడుదల చేసింది. 2019 ఎన్నికలు ఏప్రిల్‌ 11న తొలిదశ మొదలుకాగా, మే 19న చివరి దశ ముగిసింది. మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది.


మే 13నే సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉపఎన్నిక

ఈనాడు, హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్యే లాస్యనందిత మరణంతో ఖాళీ అయిన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూలే ఉప ఎన్నికకూ అమలవుతుందని పేర్కొంది. గతేడాది నవంబరు 30న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ స్థానం నుంచి భారాస తరఫున లాస్యనందిత గెలుపొందారు. గత నెల 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందటంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఆ నియోజకవర్గానికి ఏప్రిల్‌ 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మే 13న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. లోక్‌సభ నియోజకవర్గాలతోపాటే ఉప ఎన్నిక ఓట్లనూ లెక్కిస్తారు.


సాధ్యమైనంత త్వరగా కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు

సార్వత్రిక ఎన్నికల సమయంలోనే జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలూ నిర్వహించవచ్చనే ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు రాజీవ్‌కుమార్‌ బదులిస్తూ.. లోక్‌సభ పోలింగ్‌ తర్వాతే అక్కడ ఈ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అక్కడ ఏకకాల ఎన్నికలు నిర్వహించడం ఆచరణసాధ్యం కాదన్నారు. ‘‘జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పాకిస్థాన్‌ ఆక్రమిత ప్రాంతంలోని 24 సీట్లు సహా మొత్తం 107 స్థానాల ప్రస్తావన ఉంది. నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటైన డీలిమిటేషన్‌ కమిషన్‌ నివేదికతో సీట్ల సంఖ్యలో మార్పు వచ్చింది. దీన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు. లోక్‌సభ పోలింగ్‌ ముగిసిన వెంటనే అక్కడ ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉన్నామని సీఈసీ చెప్పారు.


బాండ్లపై..

ఎన్నికల బాండ్ల విషయంలో పారదర్శకత ఉండాలని ఎన్నికల సంఘం తొలి నుంచీ వాదిస్తూ వస్తోందని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. అందుకే రాజకీయ పార్టీల విరాళాలు, ఖర్చులను ఏటా సమర్పించాలన్న నిబంధన పెట్టినట్లు చెప్పారు. చందాదారుల గోప్యతను రక్షిస్తూనే చట్టబద్ధమైన విరాళ వ్యవస్థను తీసుకురావడానికి అందరూ ప్రయత్నించాలన్నారు. 12వ తరగతి పూర్తయిన విద్యార్థులకు వెంటనే ఓటరు కార్డు జారీచేసే విధానం తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు