కసబ్‌ను పట్టుకున్న సదానంద్‌ దాతెకు ఎన్‌ఐఏ పగ్గాలు

‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్‌ వసంత్‌ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్‌ఐఏ) డైరెక్టర్‌ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది.

Updated : 28 Mar 2024 09:12 IST

దిల్లీ: మహారాష్ట్ర ‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్‌ వసంత్‌ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్‌ఐఏ) డైరెక్టర్‌ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ పదవిలో ఉన్న దినకర్‌ గుప్తా ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో రాబోతున్న 1990 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి వసంత్‌- 2026 డిసెంబరు 31 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. 26/11 దాడిగా పేరొందిన ముంబయి పేలుళ్ల (2008 నవంబరు 26) ఘటనలో కీలక ఉగ్రవాదులు అజ్మల్‌ కసబ్‌, అబు ఇస్మాయిల్‌లను పట్టుకున్నది వసంతే. అప్పుడు ఆయన ముంబయి అదనపు పోలీసు కమిషనర్‌గా ఉన్నారు. ఉగ్రవాదులు విసిరిన గ్రనేడ్‌ పేలి.. కాళ్లూచేతులకు తీవ్రగాయాలై, చాలారక్తం కోల్పోయి తాను స్పృహతప్పి పడిపోయేంతవరకు దాదాపు గంటసేపు ఆయన వీరిద్దరినీ ఆనాడు వదల్లేదు. గ్రనేడ్‌ తునకలు శరీరాన్ని చీల్చినా వెనక్కి తగ్గకుండా కాల్పులు జరుపుతూ, సీనియర్‌ అధికారులకు ముఖ్యమైన సమాచారం చెబుతూ ఎదురుదాడి పనిని సులభతరం చేశారు. ఆనాటి సాహసోపేత చర్యకు గానూ ఆయన రాష్ట్రపతి పోలీసు పతకాన్ని కూడా అందుకున్నారు. ఉగ్రదాడుల కేసుల దర్యాప్తు నిపుణుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముంబయి ఘటన అనంతరం ఉగ్రదాడుల నిర్మూలనకు ఎన్‌ఐఏ ఆవిర్భవించగా 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు దాని పగ్గాలు ఆయన చేతికి దక్కాయి. అధునాతన ఆయుధాలను అలవోకగా వినియోగించగలిగే సామర్థ్యం ఉన్న వసంత్‌ దాతె.. మరాఠీలో ఒక పుస్తకం కూడా రాశారు. పేద కుటుంబానికి చెందిన ఆయన పుణెలో కొన్నాళ్లు దినపత్రికలు విక్రయించారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు పీయూష్‌ ఆనంద్‌

‘జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం’ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) అధిపతి అతుల్‌ కర్వాల్‌ స్థానంలో పీయూష్‌ ఆనంద్‌ను కేంద్రం నియమించింది. ఆనంద్‌ ప్రస్తుతం సీఐఎస్‌ఎఫ్‌ ప్రత్యేక డీజీగా ఉన్నారు. ‘బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌, డెవలప్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌గా రాజస్థాన్‌ క్యాడర్‌కు చెందిన 1990 బ్యాచ్‌ ఐపీఎస్‌ రాజీవ్‌ కుమార్‌ శర్మ నియమితులయ్యారు. ఎస్‌పీజీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా ఎస్‌.సురేశ్‌ను నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని