న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు

న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌కు ఉమ్మడిగా లేఖ రాశారు.

Updated : 29 Mar 2024 05:58 IST

బురద జల్లాలని కొందరు చూస్తున్నారు
సీజేఐ నాయకత్వానికిది పరీక్షాకాలం
సర్వోన్నత న్యాయస్థానం బలంగా నిలబడాలి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌కు 600 మంది న్యాయవాదుల లేఖ

దిల్లీ: న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌కు ఉమ్మడిగా లేఖ రాశారు.

ఈ బృందం చేస్తున్న ప్రయత్నాలు ప్రజాస్వామ్య కూర్పునకు ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి సంక్లిష్ట తరుణంలో సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నాయకత్వం కీలకమని, పరిస్థితుల్ని తట్టుకునేందుకు సుప్రీంకోర్టు బలంగా నిలబడాల్సి ఉందని పేర్కొన్నారు. హుందాతనంతో కూడిన మౌనానికి ఇది సమయం కాదన్నారు. లేఖపై సంతకాలు చేసినవారిలో బార్‌కౌన్సిల్‌ అధ్యక్షుడు మనన్‌కుమార్‌ మిశ్ర; సీనియర్‌ న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, పింకీ ఆనంద్‌ తదితరులు ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో తీర్పులను ప్రభావితం చేసేందుకు ఒత్తిడి వ్యూహాలను స్వార్థశక్తులు అమలు చేస్తున్నాయని వారు ఆరోపించారు. నిర్దిష్ట కేసుల్ని వారు ప్రస్తావించకపోయినా విపక్ష నేతలకు సంబంధించిన అవినీతి కేసులపై విచారణ జరుగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

ప్రభావితం చేసేలా ప్రయత్నాలు

‘‘న్యాయ ప్రక్రియలను ప్రభావితం చేసి, కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. కోర్టులపై ప్రజలకున్న విశ్వాసం సడలిపోయేలా కొన్ని కీలక తీర్పులపై తప్పుడు కథనాలు ప్రచారంలోకి తీసుకువస్తున్నారు. ఈ మధ్య కొందరు న్యాయవాదులు పగలు రాజకీయ నాయకులను సమర్థించేలా మాట్లాడుతూ రాత్రుళ్లు మీడియా ద్వారా న్యాయమూర్తుల్ని ప్రభావితం చేయాలని చూస్తున్నారు. గతంలోనే కోర్టులు ఎంతో బాగా పనిచేసేవని, ఇప్పటితో పోలిస్తే గడచిన కాలమే స్వర్ణయుగమనే భావనను కల్పించి, ప్రస్తుత న్యాయవ్యవస్థను కించపరుస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం కోర్టులను ప్రభావితం చేయడం, వాటికి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించడమే వారి ధ్యేయం. ఇలాంటి అంశాలు బాధాకరం’’ అని న్యాయవాదులు ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘రాజకీయ నాయకులు కొందరిపై అవినీతి ఆరోపణలు చేయడం.. ఆ తర్వాత వారినే కోర్టుల్లో సమర్థించడం వింతగా ఉంది. కోర్టు నిర్ణయాలు తమకు అనుకూలంగా రాకపోతే వెంటనే బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడదు. మౌనంగా ఉంటే.. హాని చేయాలనుకునేవారికి మరింత బలం ఇచ్చినట్లే. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది’ అని పేర్కొన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు.

అలాంటి పదాలు వాడడమేమిటి?

న్యాయవ్యవస్థ పనితీరును కించపరిచేలా ‘స్వర్ణ యుగం’, ‘బెంచ్‌ ఫిక్సింగ్‌’లాంటి పదాలను కొందరు వెటకారమైన అర్థం వచ్చేలా ప్రయోగిస్తున్నారని న్యాయవాదులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇది న్యాయవ్యవస్థను అగౌరవపరచడమే కాకుండా కోర్టుల హుందాతనాన్ని ధిక్కరించడమేనని చెప్పారు. ఇలాంటివారిని ఉపేక్షించకూడదని అన్నారు. కోర్టులను ప్రభావితం చేయడం సులభమంటూ పలువురు చేస్తున్న వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని చెప్పారు. న్యాయవ్యవస్థ సమగ్రతను కాపాడే చర్యలు చేపట్టాలని సీజేఐని అభ్యర్థించారు.

బెదిరించడం కాంగ్రెస్‌ సంస్కృతి: మోదీ

ఇతరులను బెదిరించడం, బుజ్జగించడం, వేధించడం పాతకాలపు కాంగ్రెస్‌ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. సీజేఐకి న్యాయవాదుల లేఖపై ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘‘ఐదు దశాబ్దాల క్రితం వారే (కాంగ్రెస్‌) కేంద్రానికి కట్టుబడి ఉండే న్యాయవ్యవస్థ కోసం పిలుపునిచ్చారు. వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరుల నుంచి నిబద్ధతను కోరుకుంటారు. దేశంపై ఎలాంటి నిబద్ధత చాటుకోరు. 140 కోట్ల మంది భారతీయులు వారిని దూరం పెడుతున్నందుకు ఆశ్చర్యపోనవసరం లేదు’’ అని అన్నారు.

కపట బుద్ధికి పరాకాష్ఠ: కాంగ్రెస్‌

ఈ స్పందన ప్రధాని కపట బుద్ధికి పరాకాష్ఠగా కాంగ్రెస్‌ అభివర్ణించింది. ప్రతి వ్యవస్థనూ ప్రధాని బెదిరిస్తూ, రాజ్యాంగాన్ని దెబ్బతీస్తూ, ప్రజాస్వామ్యాన్ని మభ్యపెడుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. గతంలో సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు విలేకరుల సమావేశం నిర్వహించి, ప్రజాస్వామ్యం నాశనమవుతోందని చెప్పడాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. మోదీ చేసిన తప్పులకు కాంగ్రెస్‌ను నిందించడం తగదన్నారు. న్యాయవ్యవస్థ పరిరక్షణ పేరుతో నిస్సిగ్గుగా ప్రధాని వ్యవహరిస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ విమర్శించారు. ఎన్నికల బాండ్లు సహా పలు అంశాల్లో ఇటీవలి కాలంలో మోదీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని