డిజిటల్‌ అంతరాలను చెరిపేస్తాం

భారతదేశంలో డిజిటల్‌ అంతరాలను చెరిపేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సాంకేతికతను గ్రామాలకూ తీసుకువెళతామని తెలిపారు. కృత్రిమ మేధ(ఏఐ)ని ఓ మంత్రదండంగా చూడకూడదని అన్నారు.

Published : 30 Mar 2024 06:03 IST

 గ్రామాలకూ సాంకేతికతను తీసుకువెళతాం
ఏఐని సరిగ్గా వినియోగించుకోవాలి
డీప్‌ఫేక్‌కు హద్దులు నిర్ణయించాలి
బిల్‌గేట్స్‌తో సంభాషణలో మోదీ

దిల్లీ: భారతదేశంలో డిజిటల్‌ అంతరాలను చెరిపేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సాంకేతికతను గ్రామాలకూ తీసుకువెళతామని తెలిపారు. కృత్రిమ మేధ(ఏఐ)ని ఓ మంత్రదండంగా చూడకూడదని అన్నారు. ఈ సాంకేతికతతో సవాళ్లు ఎదురవుతున్న మాట వాస్తవమేనని, వాటిని అధిగమించి అవసరాలకు తగ్గట్టు ఏఐని వినియోగించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తంచేశారు. డీప్‌ఫేక్‌పై మాత్రం ప్రధాని ఆందోళన వెలిబుచ్చారు. దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. టెక్‌ దిగ్గజం, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో శుక్రవారం ప్రధాని ‘చాయ్‌ పే చర్చ’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంకేతికత, పర్యావరణం సహా పలు రంగాలపై ఇరువురూ చర్చించుకున్నారు. ఈ సందర్భంగా సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి తాను ఇష్టపడతానని ప్రధాని తెలిపారు. ‘‘నేను నిపుణుడిని కాదు. కానీ కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఉత్సుకతతో ఉంటా. భారత్‌లో జరిగిన జీ20 సదస్సులో ఏఐ టెక్నాలజీనే చాలావరకు వినియోగించాం. ఇది శక్తిమంతమైనదే. కానీ దీన్నో మంత్రదండంగా పరిగణిస్తే తీవ్రపరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది. డీప్‌ఫేక్‌ కంటెంట్‌ను గుర్తించడం చాలా అవసరం. అందుకోసం కంటెంట్‌కు వాటర్‌మార్క్‌లు ఉండాలి. లేకపోతే చాలా ప్రమాదం. నా గొంతుతో అసభ్యపదజాలం వాడితే ప్రజలు విశ్వసించే అవకాశం ఉంది. ఈ విషయంలో హద్దులు నిర్ణయించుకోవాలి’’ అని మోదీ పేర్కొన్నారు.

నమో యాప్‌లో కృత్రిమ మేధ

ప్రధాని మోదీ, బిల్‌గేట్స్‌ ముఖ్యంగా కృత్రిమ మేధ, దాని ప్రయోజనాలపైనే ఎక్కువగా మాట్లాడుకున్నారు. నమో యాప్‌లోనూ ఏఐని వినియోగించామని మోదీ చెప్పారు. కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో తన హిందీ ప్రసంగం తమిళంలోకి ఏఐ టెక్నాలజీ ద్వారానే మారిందన్న విషయాన్ని తెలిపారు. ‘‘డిజిటల్‌ రంగంలో భారత్‌ చాలా మార్పులు తీసుకొచ్చింది. ‘నమో డ్రోన్‌ దీదీ’ పథకం విజయవంతంగా అమలవుతోంది. సైకిల్‌ నడపడం కూడా రాని మహిళలు.. ఇప్పుడు పైలట్లుగా, డ్రోన్లు ఆపరేట్‌ చేసే స్థాయికి ఎదిగారు’’ అని బిల్‌గేట్స్‌కు వివరించారు.

విద్య, వైద్యంలోనూ..

భారత్‌లో తాము డిజిటల్‌ అంతరాలకు తావివ్వబోమని ప్రధాని స్పష్టం చేశారు ‘‘గ్రామాలకు డిజిటల్‌ విప్లవాన్ని తీసుకువెళతాం. ఇది మాకు ముఖ్యమైన లక్ష్యం. సాంకేతికతను ఉపయోగించి దేశవ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న రెండు లక్షల ఆరోగ్య కేంద్రాలను పట్టణాల్లో ఆసుపత్రులకు అనుసంధానం చేశాం. అత్యుత్తమ వైద్యాన్ని గ్రామీణవాసులకు అందిస్తున్నాం. విద్యావ్యవస్థలోనూ ఇలాంటి మార్పులే చేస్తాం. బోధనా సిబ్బంది కొరత తెలియకుండా సాంకేతికతను వాడుకుంటాం. విద్యార్థికి అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తాం’’ అని మోదీ చెప్పారు.

పర్యావరణ పదజాలమూ మారాలి

పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రస్తుతం అంతర్జాతీయంగా అనుసరించిన పదజాలం మారాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ‘‘వాతావరణ మార్పుల విషయంలో ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్లాలి. ఒకటి ఆవిష్కరణ. రెండోది పర్యావరణ అనుకూల జీవనశైలులు. అదే సమయంలో పర్యావరణ సవాళ్లను ఎదుర్కొవడానికి ఉపయోగిస్తున్న పదజాలమూ మారాలి. ఉక్కు, ఇంధనం వినియోగం ఆధారంగా దేశ అభివృద్ధిని లెక్కకడుతున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఈ ప్రమాణాలను కొనసాగిస్తే కర్బన ఉద్గారాల శాతం పెరుగుతుంది. ఇది మారాలి. పర్యావరణ హితంగా ప్రమాణాలు ఉండాలి. మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. జీడీపీని హరిత జీడీపీగా పిలవాలి. మొత్తం జీడీపీలో పర్యావరణ జీడీపీ ఎంత ఉందో లెక్కించాలి’’ అని ప్రధాని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు