టీ, రొట్టె ముక్కలతో రోజు మొదలు

మనీ లాండరింగ్‌ కేసులో 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను సోమవారం సాయంత్రం తిహాడ్‌ జైలుకు తరలించారు.

Updated : 02 Apr 2024 05:43 IST

ఉదయం 10.30కే భోజనం.. 12 నుంచి 3 గంటల వరకూ గదిలోనే
సాయంత్రం 5.30కే రాత్రి భోజనం.. 7 గంటలకు మళ్లీ సెల్‌కు
తిహాడ్‌ జైల్లో కేజ్రీవాల్‌ దినచర్య

దిల్లీ: మనీ లాండరింగ్‌ కేసులో 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను సోమవారం సాయంత్రం తిహాడ్‌ జైలుకు తరలించారు. అక్కడ మిగిలిన ఖైదీల మాదిరిగానే కేజ్రీవాల్‌ దినచర్య ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. అల్పాహారంలో భాగంగా ఆయనకు టీ, కొన్ని రొట్టెముక్క(బ్రెడ్‌ స్లైసు)లు ఇవ్వనున్నారు. కాలకృత్యాలు పూర్తయిన తర్వాత కోర్టు విచారణ ఉంటే తీసుకెళ్తారు. లేదంటే కేజ్రీవాల్‌ తన న్యాయబృందంతో సమావేశమయ్యేందుకు అనుమతి ఉంది. ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య భోజనం ఇవ్వనున్నారు. పప్పు, కూర, అన్నం, ఐదు రొట్టెలు ఆహారంగా ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సీఎం తన గదిలోనే ఉండాలి. మధ్యాహ్నం 3.30 గంటలకు ఒక కప్పు టీ, రెండు బిస్కట్లు ఇస్తారు. సాయంత్రం 4 గంటలకు మళ్లీ తన లాయర్లతో సమావేశం అవ్వొచ్చు. సాయంత్రం 5.30 గంటలకే రాత్రి భోజనం అందిస్తారు. రాత్రి 7 గంటలకల్లా మళ్లీ సెల్‌కు పంపిస్తారు.

24/7 వైద్య సిబ్బంది అందుబాటులో

కేజ్రీవాల్‌కు టీవీ చూసే సదుపాయం ఉంది. 18 నుంచి 20 ఛానళ్ల వరకు చూసేందుకు అనుమతించారు. 24/7 వైద్యసిబ్బంది అందుబాటులో ఉంటారు. ఆయన షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నందున రెగ్యులర్‌ చెకప్‌లు చేయనున్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా ప్రత్యేక డైట్‌ ఇవ్వాలని ఆయన లాయర్లు అభ్యర్థించారు. ఇక, కేజ్రీవాల్‌ వారానికి రెండుసార్లు తన కుటుంబసభ్యులతో మాట్లాడొచ్చు. జైల్లో తనకు రామాయణం, భగవద్గీత, ‘హౌ ప్రైమ్‌మినిస్టర్స్‌ డిసైడ్‌’ అనే పుస్తకాలను అందించాలన్న కేజ్రీవాల్‌ అభ్యర్థనకు కోర్టు అంగీకరించిందా లేదా అనేది స్పష్టత లేదు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియా ప్రస్తుతం ఇదే కారాగారంలో ఒకటో నంబరు జైలులో ఉన్నారు. ఇక, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌కు ఐదో నంబరు కేటాయించారు. మరో ఆప్‌ నేత సత్యేందర్‌ జైన్‌ ఏడో నంబరు సెల్‌లో ఉన్నారు. 

ఎన్నికల సమయంలో.. నా భర్తను జైల్లో ఉంచడమే భాజపా లక్ష్యం: సునీత

లోక్‌సభ ఎన్నికల సమయంలో తన భర్తను జైల్లో ఉంచడమే భాజపా లక్ష్యమని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌ సోమవారం ఆరోపించారు. ఆయనను అరెస్టు చేసి 11 రోజుల పాటు ప్రశ్నించారని, కోర్టు కేజ్రీవాల్‌ను దోషిగా ప్రకటించలేదని ఆమె పేర్కొన్నారు. మళ్లీ ఆయనను జైళ్లో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. భాజపా నియంతృత్వానికి ప్రజలు తగిన సమాధానం చెబుతారని సునీత పేర్కొన్నారు.

కేజ్రీవాల్‌పై ఈడీ దర్యాప్తులో కాంగ్రెస్‌ పాత్ర: కేరళ సీఎం

దిల్లీ మద్యం విధానం రూపకల్పనపై ఈడీ దర్యాప్తునకు కాంగ్రెస్‌ డిమాండ్‌ చేయడంతోపాటు ఫిర్యాదు కూడా చేసిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సోమవారం వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు 18 విపక్ష పార్టీల ‘ఇండియా కూటమి’ ఐక్యతను దెబ్బతీసేవిగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో విజయన్‌ మాట్లాడుతూ..మద్యం విధానంపై దిల్లీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ విమర్శించిందన్నారు. అంతేకాకుండా ఈడీ దర్యాప్తును కోరుతూ ఫిర్యాదు కూడా చేసిందన్నారు. దిల్లీ మాజీ మంత్రి మనీశ్‌ సిసోదియా అరెస్ట్‌ అయినప్పుడు, కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేసింది కూడా కాంగ్రెస్‌ అని ధ్వజమెత్తారు. దిల్లీలో ఆదివారం జరిగిన బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలిరావడం భాజపాకు బలమైన హెచ్చరిక అన్న విజయన్‌, ఈ సభ నుంచి కాంగ్రెస్‌ కూడా గుణపాఠం నేర్చుకోవాలని చురకలు అంటించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్సేతర పార్టీలపై విమర్శలు చేసేముందు తమ వైఖరి ఏంటో ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ పార్టీకి హితవు పలికారు.


మీ నోట్‌ను ప్రత్యేక కోర్టుకు సమర్పించండి

 కస్టడీ నుంచి కేజ్రీవాల్‌ ఆదేశాలపై ఈడీకి దిల్లీ హైకోర్టు ఆదేశం

దిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కస్టడీలో ఉన్న సమయంలోనే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మంత్రివర్గ సహచరులకు ఆదేశాలు జారీ చేసిన ఘటనపై తన నోట్‌ను ప్రత్యేక కోర్టుకు సమర్పించాలని దిల్లీ హైకోర్టు సోమవారం ఈడీని ఆదేశించింది. ఈ అంశంలో అవసరమైతే ఆదేశాలు జారీ చేయాలంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ మన్మీత్‌ పీఎస్‌ అరోడాలతో కూడిన ధర్మాసనం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తికి సూచించారు. ఈడీ కస్టడీ నుంచి ఆదేశాలు జారీ చేయకుండా కేజ్రీవాల్‌ను నిరోధించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) విచారిస్తూ ధర్మాసనం పై మేరకు పేర్కొంటూ పిల్‌ను పరిష్కరించింది.


కేజ్రీవాలే మా ముఖ్యమంత్రి

 సునీత కీలక పాత్ర పోషిస్తారు
ఆప్‌ వర్గాల వెల్లడి

దిల్లీ: అరవింద్‌ కేజ్రీవాల్‌ను తిహాడ్‌ జైలుకు తరలించినప్పటికీ, అయన ఎన్ని రోజులు అక్కడ ఉన్నప్పటికీ ఆయనే దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) వర్గాలు వెల్లడించాయి. రాబోయే రోజుల్లో కేజ్రీవాల్‌ భార్య సునీత ఆప్‌లో కీలక పాత్ర పోషించనున్నారని తెలిపాయి. ఈ మేరకు దిల్లీలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ నేత జాస్మిన్‌ షా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని