నిష్పాక్షిక ఓటుకు ఏఐ చేటు!

దేశంలో వేసవి తాపంతోపాటు ఎన్నికల వేడి కూడా క్రమంగా పెరుగుతోంది. గెలుపే లక్ష్యంగా నేతలు విమర్శలు, ప్రతివిమర్శలకు పదును పెడుతున్నారు.

Updated : 03 Apr 2024 05:44 IST

డీప్‌ఫేక్‌లు, వాయిస్‌క్లోనింగ్‌లతో ఎన్నికలకు సవాళ్లు

దేశంలో వేసవి తాపంతోపాటు ఎన్నికల వేడి కూడా క్రమంగా పెరుగుతోంది. గెలుపే లక్ష్యంగా నేతలు విమర్శలు, ప్రతివిమర్శలకు పదును పెడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఈ క్రమంలో కృత్రిమ మేధ (ఏఐ), డీప్‌ఫేక్‌, వాయిస్‌ క్లోనింగ్‌ టెక్నాలజీల వినియోగం చర్చనీయాంశమైంది. ఈ అధునాతన సాంకేతికతతో లాభమెంతో.. నష్టమూ అంతే! ఈ సాధనాలతో ఒక వ్యక్తి ఆహార్యాన్ని మార్చడం, అనని మాటలను అన్నట్లుగా చూపడంలాంటి చర్యలతో సైబర్‌ నేరగాళ్లు కలకలం సృష్టిస్తున్నారు. ఎన్నికల్లో ఇలాంటి సాంకేతిక గిమ్మిక్కులు ప్రయోగించి.. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. తద్వారా ఒక పార్టీకి అనుకూలంగా/ వ్యతిరేకంగా మొగ్గేలా చేయవచ్చు. ఇవి నిష్పాక్షిక ఎన్నికలకు విఘాతం కలిగిస్తాయని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొన్నేళ్ల కిందటితో పోలిస్తే ఏఐ సాంకేతిక పరిజ్ఞానాలు చౌకలో అందుబాటులోకి వచ్చాయి. ప్రజల్ని ఇట్టే బుట్టలో పడేసే డీప్‌ఫేక్‌లను తయారుచేయడానికి పెద్దపెద్ద సంస్థలే అవసరంలేదని, ఆ పరిజ్ఞానంపై కాస్త అవగాహన ఉన్నవారు ఒక ల్యాప్‌టాప్‌ సాయంతో నకిలీలను వ్యాప్తి చేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్‌కు చెందిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కమల్‌నాథ్‌ల నకిలీ వీడియోలు వెలువడ్డాయి. వారు అనని మాటలను అందులో చొప్పించారు. దీనికితోడు పలు దేశాల్లో జరిగిన పరిణామాలు కూడా ఆందోళనను పెంచుతున్నాయి.

  • పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో.. ఓటర్లలో ఆసక్తిని చంపేసే డీప్‌ఫేక్‌ సందేశాలను సైబర్‌ నేరగాళ్లు సృష్టించారు. ‘‘పోలింగ్‌కు రావొద్దు. మనకు వ్యతిరేకంగా భారీగా రిగ్గింగ్‌ జరిగింది’’ అంటూ ప్రచారం చేశారు. దీంతో బాధిత పార్టీల నేతలు స్పందించి.. ఆ సందేశాలు నిజం కాదంటూ ఓటర్లను నమ్మించడానికి ఆపసోపాలు పడ్డారు.
  • బంగ్లాదేశ్‌లో ఎన్నికలకు ముందు డీప్‌ఫేక్‌ వీడియోలు వచ్చాయి. వాటిలో.. విపక్ష రాజకీయ నాయకురాలు రుమిన్‌ ఫర్హానాను బికినీలో, మరో మహిళా నేత నిపుణ్‌ రాయ్‌ను ఈతకొలనులో చూపించారు.
  • ఈ ఏడాది జనవరిలో అమెరికాలోని న్యూహాంప్‌షైర్‌లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అధ్యక్షుడు జో బైడెన్‌ స్వరాన్ని అనుకరిస్తూ ఒక నకిలీ సందేశం వచ్చింది. ప్రైమరీలో పాలుపంచుకోవద్దంటూ ఆయన సూచించినట్లు అందులో ఉంది.
  • స్లొవేకియాలో ఏఐ సాయంతో ఒక అభ్యర్థి స్వరాన్ని అనుకరించారు. మద్యం ధరలను పెంచడానికి, ఎన్నికల్లో రిగ్గింగ్‌ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నానని ఆయన పేర్కొన్నట్లు అందులో ఉంది.

పెరిగిన ముప్పు

భారత్‌లో ఇప్పుడు మొబైల్‌ డేటా చౌకలో అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్‌ఫోన్ల వినియోగం విస్తృతమైంది. ఈ నేపథ్యంలో.. అదును చూసి సామాజిక మాధ్యమాల్లోకి వదిలే డీప్‌ఫేక్‌లు కార్చిచ్చులా వ్యాపించి, అభ్యర్థులపై ఓటర్లలో ఆగ్రహం పెంచేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. లేదా భారీగా రిగ్గింగ్‌ జరుగుతోందని.. మీరు ఓటువేసినా నిష్ఫలమని ప్రజల్ని నమ్మించే ప్రమాదం ఉందంటున్నారు. ఏఐ సృష్టించే నకిలీ వార్తల వల్ల ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ముప్పు కూడా ఉంది.

  • 2020లో భాజపా నేత మనోజ్‌ తివారీ.. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హరియాణ్వీ యాసలో డబ్‌ చేసిన ఒక ఏఐ ఆధారిత వీడియో సందేశాన్ని తెరపైకి తెచ్చారు. నాడు ప్రసంగానికి తగ్గట్లు తివారీ పెదాల కదలికలు సింక్‌ చేయడానికి ఒకటిన్నర రోజు పట్టింది. పైగా ఆ స్వరం టెక్నాలజీతో సృష్టించింది కాదు. ఒక మిమిక్రీ కళాకారుడు డబ్బింగ్‌ చేశారు. ఇప్పుడు సాంకేతికత మారింది. లిప్‌ సింకింగ్‌ టెక్నాలజీతోపాటు వాయిస్‌ ట్రెయినింగ్‌ మాడ్యూల్స్‌ వచ్చాయి. వీటి సాయంతో అచ్చంగా ఆ వ్యక్తి మాట్లాడుతున్నట్లే వీడియోలను వేగంగా తయారుచేయవచ్చు.
  • భారతీయ ఎన్నికలపై అనేక దేశాలకు ఆసక్తి ఉండొచ్చు. ఏఐ సాయంతో మన ఎన్నికలను అవి ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మంచికీ వాడొచ్చు..

ఎన్నికల్లో విచ్ఛిన్నకర అంశాలకే కాకుండా మంచి విషయాలకూ ఏఐని వాడొచ్చు. ఓటర్లకు చేసే ‘పర్సనలైజ్డ్‌ ఇంటరాక్టివ్‌ ఫోన్‌కాల్స్‌’ వంటివి ఆసక్తికరమైన నూతన ఆవిష్కరణలు. వాటితో ఎన్నికల ప్రక్రియకు ముప్పు ఉండదు. ఇలాంటి వన్‌-టు-వన్‌ కాల్స్‌ భారత్‌లో ఇంకా వాస్తవ రూపం దాల్చలేదు. అయితే.. వ్యక్తిగతంగా ఓటర్ల పేర్లను ప్రస్తావిస్తూ అభ్యర్థి స్వరంతో ప్రీ రికార్డెడ్‌ సందేశాలను రాజస్థాన్‌లో కాంగ్రెస్‌, దిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీలు ఉపయోగించాయి. వీటితో ఇబ్బంది లేదు.

  • ఒక నేత చేసే ప్రసంగాన్ని అప్పటికప్పుడు ఇతర భాషల్లోకి తర్జుమా చేసే పనులకూ ఏఐని ఉపయోగించుకోవచ్చు.
  • దివంగత నేతలను ప్రచారంలోకి దించొచ్చు. తమ పార్టీలకు అనుకూలంగా వారు ఓట్లను అడుగుతున్న వీడియోలను రూపొందించొచ్చు. దివంగత నేత కరుణానిధి.. పార్టీ నేతలకు సూచనలు చేస్తున్న వీడియోలు ఇటీవల వెలువడ్డాయి.

ప్రభుత్వం, ఈసీ ఏం చేస్తున్నాయి?

  • నకిలీ వార్తలు, దుష్ప్రచారాన్ని గుర్తించడానికి, వేగంగా స్పందించడానికి ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రామాణిక నిర్వహణ విధానాల (ఎస్‌వోపీ)ను జారీ చేసింది.
  • ఎన్నికల సమయంలో ఏఐతో పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఇండియన్‌ సైబర్‌క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ)ని నోడల్‌ సంస్థగా నియమించింది. ఆన్‌లైన్‌లో అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించడం దీని ఉద్దేశం.
  • రాష్ట్ర పోలీసు శాఖలోని సైబర్‌ క్రైమ్‌ విభాగాలు కూడా ఆన్‌లైన్‌లో ‘గస్తీ తిరుగుతూ’ నకిలీ వార్తలు, అభ్యంతరకర కంటెంట్‌ను గుర్తిస్తుంటాయి.
  • సత్వర చర్యల కోసం అన్ని జిల్లాల్లో సైబర్‌ సెల్స్‌ సమన్వయంతో సామాజిక మాధ్యమ సెల్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఈసీ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సంఘానికి చెందిన ‘మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మోనిటరింగ్‌ కమిటీ’ కూడా సామాజిక మాధ్యమాలపై గట్టి నిఘా పెట్టినట్లు వివరిస్తున్నారు.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని