‘నోటా..’ కొరగాని తూటా

దేశంలో ప్రతి ఎన్నికకు ఎవ్వరికీ ఉపయోగపడని నోటా ఓట్లు పెరిగిపోతున్నాయి. ఇలాంటివి 2014 లోక్‌సభ ఎన్నికల్లో 60,00,197 నమోదు కాగా, 2019లో 65,22,772కి చేరాయి.

Updated : 07 Apr 2024 22:35 IST

కోరల్లేని పాములా ‘నన్‌ ఆఫ్‌ ద ఎబౌ’ విధానం
నిష్ప్రయోజనకరంగా సుప్రీం తీర్పు.. ఈసీ ప్రయత్నం
క్రిమినల్‌ కేసులున్న ఎంపీల నిష్పత్తి పెరుగుదల

ఈనాడు, దిల్లీ: దేశంలో ప్రతి ఎన్నికకు ఎవ్వరికీ ఉపయోగపడని నోటా ఓట్లు పెరిగిపోతున్నాయి. ఇలాంటివి 2014 లోక్‌సభ ఎన్నికల్లో 60,00,197 నమోదు కాగా, 2019లో 65,22,772కి చేరాయి. మొత్తం పోలయిన ఓట్లలో వీటి శాతం తక్కువగా ఉన్నప్పటికీ సంఖ్యాపరంగా భారీగానే ఉన్నాయి. నన్‌ ఆఫ్‌ ద ఎబౌ (నోటా) పేరుతో ఈ విధానం 2013లో సుప్రీంకోర్టు తీర్పుతో అమల్లోకి వచ్చింది. అయితే ఇది కోరల్లేని పాములా తయారైందని, రాజకీయవ్యవస్థపై ఇది ఎలాంటి ప్రభావం చూపడంలేదన్న అభిప్రాయం ఉంది. మచ్చపడ్డ అభ్యర్థులను రాజకీయపార్టీలు దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో నోటాను ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు 2013లో ఇచ్చిన తీర్పులో ఆదేశించింది. రంగంలో ఉన్న అభ్యర్థులపై ఇష్టంలేని ఓటర్లు పైవారందర్నీ తిరస్కరించే విధంగా బ్యాలెట్‌ పేపర్లు, ఈవీఎంలలో చిట్టచివరన నోటా ఆప్షన్‌ను పొందుపరచాలని భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీఐ)ను ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పునకు ముందు అభ్యర్థులకు ఓటేయడానికి ఇష్టంలేని ఓటర్లు 49-ఓ ఫామ్‌ను భర్తీచేసి ఇవ్వడానికి అవకాశం ఉండేది. ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961 ప్రకారం రూల్‌ 49-ఓ కింద పోలింగ్‌స్టేషన్‌లో ఇలా ఫామ్‌ భర్తీచేసి ఇవ్వడం అన్నది వ్యక్తిగత గోప్యతకు భంగం కల్గించే విధంగా ఉన్నట్లు భావించి సుప్రీం కోర్టు నోటాను ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఓటరు ప్రస్తుత వ్యవస్థ, అభ్యర్థులమీదున్న వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి ఈ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ అదేమీ పెద్ద ప్రభావం చూపలేదని నిపుణులు చెబుతున్నారు. 2009లో ఎన్నికైన ఎంపీల్లో క్రిమినల్‌ కేసులున్నవారి నిష్పత్తి 30% ఉండగా, 2019 నాటికి అది 43%కి పెరిగినట్లు ఏడీఆర్‌ వెల్లడించింది. నేర, అవినీతి నేపథ్యం ఉన్న అభ్యర్థులను తిరస్కరించేందుకు ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ దానివల్ల పెద్ద ప్రభావం చూపలేదని గణాంకాలు చెబుతున్నాయి. వీటి సరళిని చూస్తే ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా లేదు. దేశంలో అత్యధికమంది ఓటర్లు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నప్పటికీ నోటా ఓట్లు మాత్రం బిహార్‌లో అధికంగా నమోదయ్యాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ఆరోస్థానం, తెలంగాణ 13వ స్థానంలో నిలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని