సామాజిక మాధ్యమాల దుర్వినియోగం

కోర్టు పరిధిలోని కేసులపై సామాజిక మాధ్యమ వేదికల్లో తప్పుడు వ్యాఖ్యానాలు చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇలా చేయడం న్యాయస్థానాల అధికారాన్ని తగ్గించడమేనని పేర్కొంది.

Published : 12 Apr 2024 05:40 IST

భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో కోర్టు పరిధిలోని అంశాలనూ వక్రీకరిస్తున్నారు
ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం: సుప్రీంకోర్టు

దిల్లీ: కోర్టు పరిధిలోని కేసులపై సామాజిక మాధ్యమ వేదికల్లో తప్పుడు వ్యాఖ్యానాలు చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇలా చేయడం న్యాయస్థానాల అధికారాన్ని తగ్గించడమేనని పేర్కొంది. రిజర్వులో ఉంచిన తీర్పుపై ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసిన అస్సాం ఎమ్మెల్యే కరీముద్దీన్‌ బర్భూయాపై కోర్టు ధిక్కార చర్యలు చేపడుతూ జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం.. భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కోర్టులో పెండింగులో ఉన్న విషయాలకు సంబంధించి సామాజిక మాధ్యమ వేదికల్లో వ్యాఖ్యలు, కథనాలను పోస్టు చేయడం ఆందోళన కలిగించే అంశం. విమర్శలు, నిందలను ఎదుర్కొనే విశాల హృదయం ఈ న్యాయస్థానానికి ఉన్నప్పటికీ, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఏకంగా న్యాయ ప్రక్రియలోనే జోక్యం చేసుకోవడం తీవ్రమైన విషయం. వాదనల సందర్భంగా ఓ పక్షానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా న్యాయమూర్తులు స్పందించడం సర్వ సాధారణం. అంత మాత్రాన కోర్టు ప్రొసీడింగ్స్‌పై సామాజిక మాధ్యమాల్లో వాస్తవాలను వక్రీకరిస్తూ వ్యాఖ్యలు లేదా సందేశాలు పెట్టే హక్కు ఎవరికీ లేదు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడిన ఆల్‌ ఇండియా యునైటెడ్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ (ఏఐయూడీఎఫ్‌) ఎమ్మెల్యే కరీముద్దీన్‌ను నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానంలో హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. తనకు వ్యతిరేకంగా దాఖలైన ఎన్నికల పిటిషన్‌ కేసులో అనుకూలంగా తీర్పు వచ్చిందని గత నెల 10న ఫేస్‌బుక్‌లో కరీముద్దీన్‌ పోస్టు పెట్టారు. అప్పటికి తీర్పు వెలువడలేదు. రిజర్వులో ఉంచుతున్నట్లు మాత్రమే న్యాయస్థానం ప్రకటించింది. ఈ నెల 8న తీర్పు వెలువరించింది. అందులో కరీముద్దీన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. అయినా తీర్పు తనకు అనుకూలంగా వచ్చిందని ముందే కరీముద్దీన్‌ ప్రకటించుకోవడంపై సర్వోన్నత న్యాయస్థానం ఈ కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని