ఇజ్రాయెల్‌కు 6,000కు పైగా భారత కార్మికులు

హమాస్‌తో యుద్ధం కారణంగా కార్మికుల కొరతతో ఇబ్బందిపడుతున్న ఇజ్రాయెల్‌ నిర్మాణ రంగాన్ని భారత్‌ ఆదుకోనుంది. 6 వేలకుపైగా భారత కార్మికులు ఏప్రిల్‌, మేలో ఇజ్రాయెల్‌ వెళ్లనున్నారు.

Published : 12 Apr 2024 05:17 IST

ప్రత్యేక విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు

జెరూసలెం/దిల్లీ: హమాస్‌తో యుద్ధం కారణంగా కార్మికుల కొరతతో ఇబ్బందిపడుతున్న ఇజ్రాయెల్‌ నిర్మాణ రంగాన్ని భారత్‌ ఆదుకోనుంది. 6 వేలకుపైగా భారత కార్మికులు ఏప్రిల్‌, మేలో ఇజ్రాయెల్‌ వెళ్లనున్నారు. వీరందరినీ ప్రత్యేక విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇవ్వాలని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం నిర్ణయించింది. హమాస్‌తో యుద్ధం చెలరేగకముందు పాలస్తీనా అధీనంలోని వెస్ట్‌ బ్యాంక్‌ నుంచి 80,000, గాజా నుంచి 17,000 పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌లో పనిచేస్తుండేవారు. ఘర్షణల నేపథ్యంలో వారి పని అనుమతులను ఇజ్రాయెల్‌ రద్దు చేసింది.

20,000 మందికి అనుమతి!

గత కొన్ని నెలల్లో దాదాపు 900 మంది కార్మికులు భారత్‌ నుంచి ఇజ్రాయెల్‌ వచ్చినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతవారం మరో 64 మంది చేరుకున్నారు. ప్రాథమిక పరీక్షల తర్వాత ఇజ్రాయెలీ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ దాదాపు 20,000 మంది భారత, శ్రీలంక కార్మికులకు అనుమతులు ఇచ్చింది. అందులో వెయ్యి మంది మాత్రమే ఇప్పటికి చేరుకున్నారు. డిసెంబర్‌లో భారత ప్రధాని మోదీతో నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడారు. ఆ సమయంలో ఇజ్రాయెల్‌కు వచ్చే భారత కార్మికులకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని