స్పందించకపోవడం చట్ట ఉల్లంఘనే

ఎన్నికల సమయంలో ఈవీఎంలు, వీవీప్యాట్ల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ దాఖలైన ఆర్టీఐ అభ్యర్థనపై ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించకపోవడంపై శుక్రవారం కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

Published : 13 Apr 2024 04:48 IST

ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన సీఐసీ

దిల్లీ: ఎన్నికల సమయంలో ఈవీఎంలు, వీవీప్యాట్ల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ దాఖలైన ఆర్టీఐ అభ్యర్థనపై ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించకపోవడంపై శుక్రవారం కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఆర్టీఐ అభ్యర్థనపై ఎందుకు ఇప్పటివరకు స్పందించలేదో తమకు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంల పనితీరుపై తీసుకున్న చర్యలు, వాటి విశ్వసనీయతకు సంబంధించిన వివరాలను తెలపాలని కోరుతూ పలువురు విద్యావేత్తలు, మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, ఐఐటీ, ఐఐఎం అధ్యాపకులు ఎన్నికల సంఘానికి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద వినతిపత్రం పంపారు. దానిపై సంతకం చేసిన వారిలో ఒకరైన మాజీ ఐఏఎస్‌ అధికారి ఎం.జి.దేవసహాయం.. అనంతరం 2022 నవంబరు 22న ఎన్నికల సంఘానికి ఓ దరఖాస్తు సమర్పించారు. తాము పంపిన వినతిపత్రాన్ని ఏ అధికారి సమీక్షిస్తున్నారు? సమస్యపై జరిగిన సమావేశాల వివరాలు, సంబంధిత దస్త్రాల సమాచారాన్ని తెలపాలంటూ అందులో కోరారు. అయినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం స్పందించలేదు. దీంతో ఆయన సీఐసీని ఆశ్రయించారు. ఈ విజ్ఞప్తిపై వాదనలు విన్న కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌ హీరాలాల్‌ సామరియా.. కేసు రికార్డులు, విచారణలో సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తర్వాత అప్పటి పీఐఒ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 30 రోజుల్లోగా ఈవీఎంల పనితీరుపై పూర్తి సమాచారమివ్వాలని ఈసీని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని