ఈపీఎఫ్‌కు వడ్డీ ఆదాయం అదిరింది!

ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌) నిల్వలపై గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఆ సంస్థ తొలిసారి రూ.లక్ష కోట్లకు పైగా వడ్డీ ఆదాయాన్ని ఆర్జించింది.

Updated : 14 Apr 2024 09:00 IST

తొలిసారి రూ.లక్ష కోట్లకు పైగా ఆర్జన
ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులతో అధిక రాబడి
ఏటా 10 శాతానికి పైగా పెరుగుతున్న చందా
రూ.15 లక్షల కోట్లకు చేరిన మొత్తం నిల్వలు

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌) నిల్వలపై గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఆ సంస్థ తొలిసారి రూ.లక్ష కోట్లకు పైగా వడ్డీ ఆదాయాన్ని ఆర్జించింది. ఉద్యోగుల వేతనం నుంచి ప్రతి నెలా 12 శాతం చొప్పున వసూలు చేసే చందాల నిల్వలపై ఈ ఆదాయం లభించింది. ఈపీఎఫ్‌వో నిల్వలను నిబంధనల మేరకు ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌)లో, ప్రభుత్వ, ప్రైవేటు బాండ్లలో, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో సంస్థ పెట్టుబడులు పెడుతోంది. వీటిల్లో ఈటీఎఫ్‌ల నుంచి అత్యధికంగా లాభాలు ఆర్జిస్తోంది. 2023-24 ఏడాదికి పెట్టుబడులపై రూ.90 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినప్పటికీ, ఈటీఎఫ్‌ పెట్టుబడుల ద్వారా మెరుగైన లాభాలు రావడంతో వడ్డీ ఆదాయం రికార్డుస్థాయిలో రూ.1,04,493 కోట్లు వస్తోందని ఈపీఎఫ్‌వో తేల్చింది. దీంతో భవిష్యనిధి నిల్వలపై 2023-24 ఏడాదికి చందాదారులకు 8.25 శాతం చొప్పున వడ్డీ చెల్లించనున్నట్లు తెలిపింది. ఈటీఎఫ్‌ పెట్టుబడులపై మెరుగైన లాభాలు వస్తుండటంతో సంస్థ మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. కాలపరిమితి ముగిసిన ఈటీఎఫ్‌లను విక్రయించగా వచ్చిన సొమ్ములో 50 శాతాన్ని తిరిగి పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఈటీఎఫ్‌ పెట్టుబడి కాలపరిమితిని నాలుగేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచాలని భావిస్తోంది.

చందా వసూళ్లు ఆరేళ్లలో రెట్టింపు

ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య ఏటా పెరుగుతోంది. దీంతో ఈపీఎఫ్‌ ఖాతా కింద చందా వసూళ్లూ పెరుగుతున్నాయి. సురక్షితమైన పెట్టుబడి కావడంతో స్వచ్ఛంద చందా (వీపీఎఫ్‌) కింద అదనంగా ఉద్యోగులు జమ చేస్తున్నారు. 2018-19 ఏడాదికి ఉద్యోగుల చందాగా రూ.1.05 లక్షల కోట్లు వసూలు కాగా.. 2023-24 ఏడాదికి వసూలవుతున్న చందా రూ.2.13 లక్షల కోట్లు దాటింది. అంటే ఆరేళ్లలో రెట్టింపు అయింది. 2022-23తో పోలిస్తే ఈపీఎఫ్‌ ఖాతా కింద చందా వసూలు ప్రస్తుతం 18 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, ముంబయి-2, గుజరాత్‌ జోనల్‌ కార్యాలయాల పరిధిలో ఈపీఎఫ్‌ ఖాతాలో చందా పెరుగుదల 20 శాతానికిపైగా ఉంటోంది. దిల్లీ జోనల్‌ పరిధిలో ఈ పెరుగుదల 30.88 శాతంగా నమోదు కావడం గమనార్హం.

తెలంగాణ రీజియన్‌ పరిధిలో..

తెలంగాణ రీజియన్‌ పరిధిలో 2024-25 ఏడాదికి ఈపీఎఫ్‌ చందా వసూలు రూ.16,816 కోట్లుగా ఉండే అవకాశాలున్నట్లు సంస్థ అంచనా వేసింది. రాష్ట్రంలో 2022-23లో రూ.13,675 కోట్ల చందా రాగా.. 2023-24 ఏడాదికి రూ.15,324 కోట్లకు చేరనున్నట్లు సంస్థ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని